Share News

Kalvakuntla Kavitha: నన్ను కుటుంబానికి దూరం చేసినోళ్ల భరతం పడతా

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:07 AM

తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని కోరుకునే తనని కుటుంబానికి దూరం చేసిన వాళ్ల భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Kalvakuntla Kavitha: నన్ను కుటుంబానికి దూరం చేసినోళ్ల భరతం పడతా

  • భవిష్యత్తులో నా జన్మభూమే నాకు కర్మ భూమి కావొచ్చు

  • సిద్దిపేట, చింతమడక ఎవరి సొత్తు కాదు

  • గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్‌లా ఆంక్షలుండేవి

  • ఇకపై ఆంక్షలు పెడితే మళ్లీ మళ్లీ వస్తా

  • తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ

వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

సిద్దిపేట, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు క్షేమంగా ఉండాలని కోరుకునే తనని కుటుంబానికి దూరం చేసిన వాళ్ల భరతం పడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కుటుంబానికి దూరమై దుఖఃంలో ఉన్న తనను తన స్వగ్రామం చింతమడక ఆదరించిందని, ప్రజలు ఆశీర్వదిస్తే తన జన్మభూమే భవిష్యత్తులో తన కర్మభూమి కావొచ్చునని పేర్కొన్నారు. తన స్వగ్రామం, సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆదివారం జరిగిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. చింతమడక జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కవిత మాట్లాడుతూ.. తన జీవితంలో గత ఏడాది ఒక రకమైన బాధాకర పరిస్థితులుండగా, ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 2004లో కేసీఆర్‌ తన పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో స్థానికంగా మరొకరిని పెట్టారన్నారు. నాటి నుంచి నేటి వరకు సిద్దిపేట, చింతమడక ప్రైవేటు ఆస్తుల్లా మారాయని, ఈ ప్రాంతాలకు రావాలంటే కేజీఎఫ్‌ మాదిరిగా ఆంక్షలు ఉండేవని ఆరోపించారు. కేసీఆర్‌ అనే చిరుతపులిని కన్న గడ్డ అయిన చింతమడక మీద ఎవరీ ఆంక్షలు చెల్లవని నిరూపించేందుకే తాను ఈ వేడుకలకు హాజరయ్యానని స్పష్టం చేశారు.


చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తానని, ఈ ప్రయాణంలో తనకు అండగా ఉండాలని ప్రజలను కోరారు. ఏ ఊరు ఎవరి అయ్య జాగీరు కాదని, కానీ తమ జాగీరుగా భావిస్తున్న కొందరి భరతం కచ్చితంగా పడతానని చెప్పారు. ఏదో రాజకీయంగా ఆంక్షలు పెడితే ఆగేదీ లేదని, ఎన్నిసార్లు ఆంక్షలు పెడితే అన్ని సార్లు చింతమడక వస్తానని స్పష్టం చేశారు. చింతమడకలో కేసీఆర్‌ను చంద్రుడని పిలుస్తారని, అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని చేశారన్నారు. తాను ఆ విషయం చెప్పడంతోనే తనని కుటుంబానికి దూరంగా పంపారని, కుటుంబానికి దూరమయ్యాననే దుఃఖంలో ఉన్న తనను చింతమడక ఆదరించిందంటూ కవిత ఉద్వేగంగా మాట్లాడారు.

Updated Date - Sep 22 , 2025 | 05:08 AM