Share News

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు హరీశ్‌ మోసం

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:18 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ తరఫున ప్రచారం చేయాలని సుమారు 15 మంది ఇండిపెండెంట్లు నన్ను సంప్రదించారు. నాకు, జూబ్లీహిల్స్‌ ఎన్నికకు సంబంధం లేదని చెప్పాను.

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌కు హరీశ్‌ మోసం

  • కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్‌ ఇవ్వండన్నారు

  • ఉప ఎన్నికలో అనేక కుట్రలు

  • టైం వచ్చినప్పుడు బయటపెడతా

  • జగదీశ్‌, ప్రశాంత్‌, నిరంజన్‌రెడ్డిలకు వందల కోట్లు ఎలా వచ్చాయి?

  • కేటీఆర్‌.. ట్విటర్‌ వదిలి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయ్‌: కవిత

మెదక్‌, చిన్నశంకరంపేట/చేగుంట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తమ తరఫున ప్రచారం చేయాలని సుమారు 15 మంది ఇండిపెండెంట్లు నన్ను సంప్రదించారు. నాకు, జూబ్లీహిల్స్‌ ఎన్నికకు సంబంధం లేదని చెప్పాను. తర్వాత వాళ్లు హరీశ్‌ రావు దగ్గరకు వెళ్లారు. మేం ఏ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని హరీశ్‌ను అడిగారు. ఆయన కూడా అదే జవాబు చెప్పారట. మీ ఇష్టం.. ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అన్నారట. నేను బీఆర్‌ఎస్‌లో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ, హరీశ్‌ రావు ఆ పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేశారు’’ అని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల అంతరార్థం.. బీఆర్‌ఎ్‌సకు ఆయన మద్దతు ఇవ్వడం లేదనేనని చెప్పారు. మోసం చేయడం, బీఆర్‌ఎస్‌ ఓడిపోగానే పార్టీ ఓటమికి తాను కారణం కాదని తప్పించుకోవడం హరీశ్‌ నైజమని దుయ్యబట్టారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితేనే తనను బయటకు పంపారని చెప్పారు. పైగా తండ్రి మరణించడం వల్లనే ఎన్నికల ప్రచారంలో హరీశ్‌ పాల్గొనలేదని, లేకపోతే, ఆయన ఈల వేస్తే విజయం వచ్చిపడేదని ఆయన భజనపరులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడుకదా అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో అనేక కుట్రలు జరిగాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతానని చెప్పారు. రెండు రోజులుగా మెదక్‌ జిల్లాలో జాగృతి జనం బాట నిర్వహించిన కవిత శనివారం చిన్న శంకరంపేటలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన మొట్టమెదటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. హవేలీ ఘనపూర్‌ మండలం ధూప్‌సింగ్‌, కూచన్‌పల్లిలో రైతులతో మాట్లాడారు. పోలంపల్లిలోని కేవల్‌ కిషన్‌ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మెదక్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రవ్యతిరేకత ఉన్నా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై అంత భారీ మెజారిటీ రావడానికి కారణం బీఆర్‌ఎస్‌ నేతలు కేవలం సోషల్‌ మీడియాకు పరిమితం కావడమేనని అన్నారు.


కేటీఆర్‌ ట్విటర్‌ వీడి బయటకొచ్చి ప్రజాక్షేత్రంలో పని చేయాలని సూచించారు. పార్టీకి తాము కృష్ణార్జునులమని బిల్డ్‌పలు ఇస్తూ ఒకరి జబ్బ ఒకరు చరుచుకుంటున్నారని, అంతే తప్ప క్షేత్రస్థాయిలో పని చేయడం లేదని కేటీఆర్‌, హరీశ్‌రావులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఉపఎన్నికల ఫలితాల తర్వాత వేలాదిమంది బీఆర్‌ఎస్‌ శ్రేణులు తమను సంప్రదిస్తున్నారని, జాగృతిలో చేరి పని చేస్తామని ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఆస్తులు పెంచుకున్నారని, కానీ, క్యాడర్‌ను పెంపొందించుకునే ఉద్దేశంవారికి లేదని ఆరోపించారు. చిన్న చింతకుంటలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు 15 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్‌కు ఈ విషయాలు ఏవీ తెలియవని అన్నారు. కేసీఆర్‌ కళ్లకు గంతలు కట్టి పార్టీ ద్వారా సంపాదించుకున్నవారు ఎందరో ఉన్నారన్నారు. జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. వీళ్లకు ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని, వీళ్ల ఆస్తులు ఎన్ని పెరిగాయని ప్రశ్నించారు. ఇక తన ఆస్తుల వివరాలకొస్తే 2014కు పూర్వం ఉన్న ఆస్తిపాస్తులే ఇప్పుడున్నాయని, అయినా, ఈడీ, సీబీఐ 3 నెలలపాటు వేధించాయని తెలిపారు. మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి గతంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదని, దాంతో, ఆమె కేసీఆర్‌పై దోసిళ్లతో దుమ్మెత్తి పోసి పార్టీని వీడిపోయిందని, అప్పట్లో హరీశ్‌ కూడా పార్టీ అభ్యర్థికి సపోర్ట్‌ చేయకపోవడంతో మరో పార్టీకి విజ యం సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ దీక్ష విజయవంతమైన తర్వాత మళ్లీ ఆమె పార్టీలోకి వచ్చిందని చెప్పా రు. కేసీఆర్‌మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్‌రెడ్డికి హరీశ్‌ రావు ఎలా సపోర్ట్‌ చేస్తారని ప్రశ్నించారు.

Updated Date - Nov 16 , 2025 | 05:21 AM