Kalvakuntla Kavitha Criticizes BRS: ఎవరిపై ఆరోపణలు వస్తే..వారే వివరణ ఇవ్వాలి
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:40 AM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావును ఉద్దేశించి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఆరోపణలు....
వందిమాగధులతో తిట్టిస్తానంటే కుదరదు
హరీశ్‌నుద్దేశించి మరోసారి కవిత వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లాలో తెలంగాణ జాగృతి జనం బాట
ఖమ్మం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావును ఉద్దేశించి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలి తప్ప.. వందిమాగధులు మాట్లాడితే కుదరదని అన్నారు. తన విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్‌రావుపై విమర్శలు చేయవద్దన్న సంగారెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వ్యాఖ్యలపై స్పందించారు. వాళ్లతో, వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలన్నీ గమనిస్తారని తెలిపారు. ఇక ప్రజల్లో కాంగ్రెస్‌పై కోపం ఉన్నా, ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కటీ అమలు కాకపోయినా జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీ గెలవడానికి కారణం ప్రతిపక్షాలుగా బీఆర్‌ఎస్, బీజేపీల వైఫల్యమేనన్నారు. అందుకే ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తీసుకుందని తెలిపారు. కవిత తొలుత మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయా న్ని సందర్శించారు. అనంతరం మధిర పట్టణంలో లెదర్‌పార్కు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలిం చారు. తరువాత సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మోడల్ స్కూల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకం 9వప్యాకేజీ టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో రూ.7కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్టు అంచనా రూ.19కోట్లకు పెరిగిందన్నారు. అక్కడి నుంచి కవిత తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తెలంగాణలోని కొత్త బొగ్గు బ్లాకులను జాతీయస్థాయిలో వేలం పాట పెట్టడంతో నష్టం మనకేనన్నారు. సత్తుపల్లిలోని వెంగళరావునగర్‌లో జేవీఆర్ ఓసీలోని కార్మికులతో కవిత మాట్లాడారు. సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.40వేల కోట్లు బకాయి పడిందన్నారు.