Kalvakuntla Kavitha Blames Niranjan Reddy: నిరంజన్ రెడ్డీ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తది
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:13 AM
వంకాయ పుచ్చు ముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారని..
అంగడి స్థలాలను కబ్జా చేసిన నిరంజన్
మూడు ఫామ్‌హౌ్‌సలు కట్టుకున్నడు
ఆయన అవినీతిని కప్పిపుచ్చిన హరీశ్‌రావు
మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తా
నిరంజన్‌రెడ్డి కారణంగా వనపర్తి స్థానంలో బీఆర్‌ఎస్ ఇక ఎన్నటికీ గెలవదు: కవిత
వనపర్తి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వంకాయ పుచ్చు ముఖం వేసుకొని ప్రజల్లోకి ఎలా వెళ్తారంటూ తనపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యక్తిగత ఆరోపణలు చేశారని, ఇంకోసారి తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలేస్తదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా హెచ్చరించారు. తండ్రి వయసు వారని.. ఇప్పటికీ గౌరవిస్తున్నానని, లేకపోతే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రెండు రోజుల ‘జాగృతి జనం బాట’లో భాగంగా రెండో రోజు సోమవారం ఆమె వనపర్తిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, వనపర్తి, పెబ్బేరులలో నిరంజన్ రెడ్డి అంగడి స్థలాలను కబ్జా చేసి మూడు ఫామ్‌హౌ్‌సలు కట్టుకున్నారని ఆరోపించారు. ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్‌రెడ్డి అని పేరు పెట్టుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కొక్కరు మూడేసి పామ్‌హౌ్‌సలు నిర్మించుకున్నారని ధ్వజమెత్తారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డి చేసిన అవినీతిని మాజీ మంత్రి హరీశ్‌రావు కప్పిపుచ్చారని ఆరోపించారు. అవినీతి విషయాన్ని పెద్దసారు దృష్టికి తీసుకెళ్లకుండా వెనుకేసుకొచ్చారని విమర్శించారు. ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరంజన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావుకు కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నందుకే నిరంజన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వనపర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, దానికి ప్రధాన కారణం నిరంజన్ రెడ్డేనని అన్నారు. పదేళ్లలో 32 మంది బీసీలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని, ఇది కూడా పెద్ద సారుకు తెలియదన్నారు. ఆయన అవినీతి బాగోతాన్ని మీడియా ద్వారా పెద్దసారు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరంజన్ రెడ్డి అవినీతిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.