Share News

Kalvakuntla Kavitha: తుమ్మలను వదులుకోవడం.. కేసీఆర్‌ తప్పే

ABN , Publish Date - Nov 19 , 2025 | 04:46 AM

గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్‌ నేతను వదులుకొని కేసీఆర్‌ తప్పు చేశారని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.....

Kalvakuntla Kavitha: తుమ్మలను వదులుకోవడం.. కేసీఆర్‌ తప్పే

  • ఆ ప్రభావం వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి

  • పార్టీ పెడితే.. వజ్రాయుధం లాంటి పార్టీ పెడతా

  • బీఆర్‌ఎస్‌కు నన్ను దూరం చేసిన వారిపై మాట్లాడి తీరుతా

  • అందరి కృషితోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి

  • ఖమ్మంలో జాగృతి అధ్యక్షురాలు కవిత

ఖమ్మం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్‌ నేతను వదులుకొని కేసీఆర్‌ తప్పు చేశారని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేసీఆర్‌ వంటి రాజకీయ అనుభవజ్ఞులే తప్పులు చేశారని, క్షేత్రస్థాయిలో తాను అలాంటివి చేయకూడదన్న లక్ష్యంతోనే ప్రజల్లోకి వెళ్తున్నానన్నారు. హడావుడిగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, తొలుత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం సాగిస్తానని వెల్లడించారు. పార్టీ పెట్టాలనుకుంటే ప్రజల కోసం వజ్రాయుధం లాంటి పార్టీ పెడతానని వ్యాఖ్యానించారు. కాంగ్రె్‌సపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలిచిందని, ఇది ప్రతిపక్షాల వైఫల్యమేనని అన్నారు. ‘జాగృతి జనం బాట’లో భాగంగా రెండో రెజు మంగళవారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. ఖమ్మంలో విలేకరులతో మాట్లాడారు. జాగృతి జనం బాట ప్రారంభించిన తర్వాత తనపై నీచ స్థాయిలో దాడి చేస్తున్నారని, అయినా బెదిరేది లేదన్నారు. గతంలో తిహార్‌ జైలులో ఆరు నెలలున్నా తాను కుంగిపోలేదని, ఇప్పటికీ ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాడతున్నానని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు రాజకీయాల్లోకి ధైర్యంగా రావాలన్న ఆకాంక్షతో వారి బరువును భుజానకెత్తుకున్నానని తెలిపారు. రాజకీయ నేపథ్యంలేని యువత, మహిళలకు జాగృతి అవకాశం ఇవ్వబోతోందని తెలిపారు. తనపై కుట్ర చేసి పార్టీకి, కుటుంబానికి కొందరు దూరం చేశారని, అలాంటి వారిపై కచ్చితంగా మాట్లాడి తీరుతానని స్పష్టం చేశారు. ఆధారాల్లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని, అన్ని ఆధారాలతోనే మాట్లాడతానని స్పష్టం చేశారు. సొంత బిడ్డనైన తననే పార్టీ నుంచి బయటకు పంపారని, పార్టీలో ఉన్న చాలా మంది తమ పరిస్థితి ఏమిటో అని ప్రశ్నించుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్నప్పుడు తాను కనీసం ఒక్క టీచర్‌ను కూడా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోలేకపోయానని చెప్పారు. అందరి కృషి వల్లే ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని, మంత్రులు ఎవరికి వారు తమ పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కవిత, ఆంధ్రాలో షర్మిల, బిహార్‌లో రోహిణి.. ఇలా ఆడబిడ్డలు సొంతపార్టీలపై తిరుగుబాటు చేయడానికి కారణామేంటని విలేకరులు ప్రశ్నించగా.. ఆడబిడ్డలను రాజకీయంగా వాడుకుని వదిలేయడం, వారి ఆత్మాభిమానం దెబ్బతీయడమే కారణమని సమాధానమిచ్చారు.

Updated Date - Nov 19 , 2025 | 04:46 AM