Kalvakuntla Kavitha: అధికారం శాశ్వతం అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:31 AM
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అలా శాశ్వతం అనుకున్నవాళ్లను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు....
నేను ఎన్నో సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు
20 ఏళ్లు బీఆర్‌ఎ్‌సలో పనిచేసిన నన్ను అవమానకరంగా బయటికి పంపారు
కేసీఆర్ తండ్రిగా పిలిస్తే వెళతా..రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు
నేను అవమానాన్ని తట్టుకోలేను
పాలిటిక్స్ పక్కాగా చేస్తా.. ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటదో చూపిస్తా
హరీశ్ బినామీ కంపెనీకి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు
1,100 కోట్ల నుంచి 1,700 కోట్లకు అంచనా వ్యయం పెంచేసుకున్నారు
‘మీట్ ద ప్రెస్’లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
వరంగల్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అలా శాశ్వతం అనుకున్నవాళ్లను ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాను ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబరాల పేరుతో ప్రతీ పల్లె తిరిగానని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రొటోకాల్ పేరుతో తనను నిజామాబాద్‌కే కట్టడి చేశారని ఆరోపించారు. తనను అకారణంగా బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. ఆదివారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో కవిత మాట్లాడారు. ‘‘బీఆర్‌ఎ్‌సలో నేను మంత్రిని కాదు. నా సంతకంతో పనులయ్యే పరిస్థితి లేదు. అయినా నా వద్దకు వచ్చిన వారికి శక్తిని మించి పనులు చేశాను. ఎన్నో సమస్యలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాను అయినా ఫలితం లేకుండేది. బీఆర్‌ఎ్‌సలో నాకు ఎవరితోనూ పంచాయితీ లేదు. అయినా కుటుంబం నుంచి నన్ను బయటికి పంపించారు. 20ఏళ్లు బీఆర్‌ఎ్‌సలో పనిచేస్తే.. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా అవమానకరంగా సస్పెండ్ చేశారు. నేనూ తెలంగాణ బిడ్డనే.. ఆకలినైనా తట్టుకుంటా.. అవమానాన్ని మాత్రం తట్టుకోను. ఇప్పుడు నాకు రాజకీయంగా బీఆర్‌ఎ్‌సతో ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ వద్దకు కూతురిగా వెళ్తా. రాజకీయంగా వెళ్లే పరిస్థితి లేదు’’ అని కవిత తేల్చిచెప్పారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశాక ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని.. ఇప్పుడే రాజకీయం చేయాలనుకోవటం లేదన్నారు. అయితే రాజకీయం చేయడం పక్కా అని.. ఆడబిడ్డలు రాజకీయంచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయాలు ఉంటాయని, అప్పటివరకు ప్రజాసమస్యలపైనే పోరాటమని పేర్కొన్నారు.
హరీశ్‌రావు బినామీ కంపెనీకి..
గత ప్రభుత్వం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను రూ.1,100కోట్ల అంచనా వ్యయంతో ఓ కంపెనీకి అప్పగించిందని, ఆ బినామీ కంపెనీ అంచనా వ్యయాన్ని రూ.1,700 కోట్లకు పెంచేలా చేసుకుందని కవిత ఆరోపించారు. ఆ బినామీ కంపెనీ హరీశ్‌రావుదేనని అం టున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టినా చర్యలు చేపట్టడం లేదేమని ప్రశ్నించారు. మేడారం టెండర్ల విషయం లో ఇద్దరు మంత్రుల పంచాయితీని ప్రజలు వినోదంగా చూశారన్నారు. రిజర్వేషన్లతోనే అవకాశాలు అని కాకుండా అందరికీ సమానంగా అవకాశాలు రావాలని కవిత ఆకాంక్షించారు. రాజకీయ నేపథ్యంలేని మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే కొత్త నాయకత్వం వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అవే సమస్యలు..
ఏ సమస్యలను లేవనెత్తి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో.. ఆ సమస్యలు రెండేళ్లయినా అలాగే ఉన్నాయని కవిత విమర్శించారు. ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించకపోవటం సిగ్గుచేటన్నారు. మెగా డీఎస్సీ వేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా గ్రూప్స్ పరీక్షలు నిర్వహించాలని సీఎం డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని.. గత ప్రభుత్వమిచ్చిన 60వేల ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పైసా సాయం చేయలేదని కవిత మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.