Share News

Kaloji University: కాళోజీ వర్సిటీలో గాడి తప్పిన పాలన!

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:54 AM

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పాలన గాడితప్పింది. అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థలలో నిర్లక్ష్యంతో సమస్యలు తలెత్తుతున్నాయి...

Kaloji University: కాళోజీ వర్సిటీలో గాడి తప్పిన పాలన!

  • పరీక్షల నిర్వహణ, ఫలితాలు, సీట్ల కేటాయింపులో గందరగోళం

  • దంత వైద్యుడి చేతికి పరీక్షల నియంత్రణ

  • తీవ్ర ఆరోపణలున్న వైద్యుడికి రిజిస్ట్రార్‌ బాధ్యతలు

  • పీజీ రేడియాలజీ పరీక్షలో పాత పేపర్లు

  • ఇటీవల పీజీ పరీక్షల్లో ఫెయిలైనవిద్యార్థులను పాస్‌ చేయడంపై సందేహాలు

  • రిటైర్డ్‌ ఉద్యోగులకు హెల్త్‌ వర్సిటీ పునరావాస కేంద్రంగా మారిందనే విమర్శలు

వరంగల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పాలన గాడితప్పింది. అకడమిక్‌, అడ్మినిస్ట్రేషన్‌ వ్యవస్థలలో నిర్లక్ష్యంతో సమస్యలు తలెత్తుతున్నాయి. వైద్య విద్య పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు, సీట్ల కేటాయింపు వరకు నిర్లక్ష్యం, అక్రమాలతో వర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. ఎంబీబీఎస్‌ చేసిన సీనియర్‌ వైద్యులు ఉండాల్సిన పరీక్షల నియంత్రణాధికారి (ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌)లో కొన్నేళ్లుగా దంత వైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించటం, అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడికి రిజిస్ట్రార్‌ పదవిని అప్పగించడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక కాళోజీ వర్సిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యను ఈ వర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చింది. మొత్తం 105 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా.. 35 మంది వరకే రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. రిజిస్ట్రార్‌, డిప్యూటీ, జాయింట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులను కూడా డిప్యూటేషన్‌పై వచ్చిన వైద్యులకే అప్పగించారు. ఇక వివిధ విభాగాల్లో కీలకమైన పోస్టుల్లో రిటైరైన వారిని తాత్కాలిక ప్రాతిపాదికన నియమించారు.

పరీక్షలు, ఫలితాల్లో దారుణం

ఇక వైద్య విద్య పరీక్షల నిర్వహణలో కాళోజీ వర్సిటీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జనవరి 15న నిర్వహించిన రేడియాలజీ పీజీ పరీక్షలో గత ఏడాది ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే మళ్లీ ఇచ్చారు. అక్టోబరు 13న జరిగిన పీజీ ఫోరెన్సిక్‌ పరీక్షలో 10 ప్రశ్నలకు బదులు 11ప్రశ్నలు ఇచ్చారు. ఇక గతేడాది పీజీ పరీక్షలను కౌన్సెలింగ్‌ను సిబ్బంది కొరత సాకుతో పలుమార్లు వాయిదా వేశారు. నవంబరు 5న వరంగల్‌ నగరానికి చెందిన ఓ విద్యార్థినికి తొలుత ఖమ్మంలోని మమత డెంటల్‌ కాలేజీలో సీటు వచ్చినట్టు వర్సిటీ అధికారులు మెసేజ్‌ పంపించారు. కానీ మరుసటి రోజే మార్చేశారు. మొదటి జాబితాలో తప్పులు దొర్లాయని.. నిజామాబాద్‌ మేఘనా డెంటల్‌ కాలేజీలో ఆమెకు సీటు వచ్చినట్టు చెప్పారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు కాలేజీ వైద్య విద్యార్థులు ఫెయిలైనా.. రీకౌంటింగ్‌లో పాస్‌ చేయటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించటంతో ఎగ్జామినేషన్‌ గదికి తాళం వేశారు.

Updated Date - Nov 28 , 2025 | 04:54 AM