Share News

Commission Corruption: కాళేశ్వరంలో కమీషన్ల కోసమే..

ABN , Publish Date - Sep 07 , 2025 | 07:34 AM

పేదల సంక్షేమం పట్టని గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కావాలనుకుంది. అందుకే.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఖర్చు పెట్టాల్సిన సొమ్మును కాళేశ్వరానికి మళ్లించి..

Commission Corruption: కాళేశ్వరంలో కమీషన్ల కోసమే..

  • పేదల ఇళ్ల సొమ్ములనూ మళ్లించారు.. మేం 4.50 లక్షల ఇళ్లకు 22,500 కోట్లు ఖర్చు పెట్టాం

  • రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

  • కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల్లో.. కవిత కొరివి దెయ్యం

  • ఎక్సైజ్‌, పర్యాటక మంత్రి జూపల్లి

  • మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘పేదల సంక్షేమం పట్టని గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమీషన్లు కావాలనుకుంది. అందుకే.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు ఖర్చు పెట్టాల్సిన సొమ్మును కాళేశ్వరానికి మళ్లించి, అవినీతికి పాల్పడ్డారు’’ అని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన ఎక్సైజ్‌, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి.. మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం - అభివృద్ధిని రాష్ట్రంలో జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామన్నా రు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు గుర్తుచేశారు. గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని, తాము రూ.22,500 కోట్లు ఖర్చుచేసి, 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ‘‘ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటే బిల్లులు రావని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేశారు.


అప్పులు చేసి, పుస్తెలమ్ముకోవాలని ప్రజలను భయపెట్టారు. మేము ప్రతీ సోమవారం ఇళ్ల నిర్మాణాలు జరిగిన మేరకు బిల్లులను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు. జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆయన కుమార్తె కవిత అంటున్నారని, ఆమె కూడా ఒక కొరివి దెయ్యమేనని ఆరోపించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకానికి కనీసం రూ.లక్ష పెంచాలని నాడు తాము కోరినా.. కేసీఆర్‌ కనికరించలేదని విమర్శించారు. ‘‘అప్పట్లో నేను అదే పార్టీ(బీఆర్‌ఎ్‌స)లో ఉన్నానని హరీశ్‌రావు చెబుతున్నారు. అప్పట్లో నేను తప్పులను ఎత్తి చూపినా పట్టించుకోలేదు’’ అని వివరించారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్ల మంజూరు విషయంలో ముఖం చూసి, బొట్టు పెట్టిందని, తమ సర్కారు మాత్రం పార్టీలకు అతీతంగా అర్హులకే ఇళ్లను మంజూరు చేసిందని స్పష్టం చేశారు.

Updated Date - Sep 07 , 2025 | 07:35 AM