Share News

Telangana Government Tells High Court: వాదనలన్నీ వినిపించి.. నోటీసు ఇవ్వలేదంటారా?

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:01 AM

కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. మాజీ సీఎం కేసీఆర్‌కు పూర్తిస్థాయి అవకాశం ఇచ్చి వాదనలు విన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది...

Telangana Government Tells High Court: వాదనలన్నీ వినిపించి.. నోటీసు ఇవ్వలేదంటారా?

  • కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్‌ పూర్తి సమయం ఇచ్చింది.. సహజ న్యాయసూత్రాలను పక్కాగా పాటించింది

  • కమిషన్‌ నివేదికను ప్రభుత్వం మీడియాకు ఇవ్వలేదు

  • అక్రమాలపై దర్యాప్తును ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది

  • నివేదికను కొట్టేయాలన్న పిటిషన్లకు కాలం చెల్లింది

  • కేసీఆర్‌ నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం

  • కేసీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌.. మాజీ సీఎం కేసీఆర్‌కు పూర్తిస్థాయి అవకాశం ఇచ్చి వాదనలు విన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. విచారణకు హాజరై, పూర్తి స్థాయి వాదనలు వినిపించి.. ఇప్పుడు కమిషన్‌ తనకు నోటీసు ఇవ్వలేదని కేసీఆర్‌ అనడం సమంజసం కాదని పేర్కొంది. కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 8-బీ, సెక్షన్‌ 8-సీ కింద నోటీసులివ్వకుండా, తన వాదన వినకుండా, సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం ఇవ్వకుండా కమిషన్‌ నివేదిక ఇచ్చిందని, దానిని కొట్టేయాలని కోరుతూ కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కౌంటర్‌ దాఖలు చేసింది. అందులో పలు కీలక అంశాలను వివరించింది. అవి..

  • పిటిషనర్‌ కేసీఆర్‌కు కమిషన్‌ పూర్తిస్థాయి సమయం ఇచ్చింది. కమిషన్‌ నోటీసులు జారీ చేయడమంటేనే కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 8-బీ కింద జారీ చేసినట్లు లెక్క. పిటిషనర్‌ తన వాదనలను పూర్తిస్థాయిలో కమిషన్‌ ఎదుట వివరించి.. తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో నోటీసు ఇవ్వలేదని చెప్పడం సమంజసం కాదు. యాక్ట్‌ ప్రకారం సెక్షన్‌ 8-బీ, సెక్షన్‌ 8-సీ నోటీసుకు ప్రత్యేకమైన ఫార్మాట్‌ అంటూ ఏదీ లేదు. నోటీసులో సెక్షన్‌ను ప్రస్తావించనంత మాత్రాన తప్పు జరిగిపోయినట్లు కాదు. ఈ వాదన న్యాయసమీక్షకు నిలబడదు. కమిషన్‌ చేపట్టిన ఎగ్జామినేషన్‌కు పిటిషనర్‌ ఎలాంటి అభ్యంతరం తెలపలేదనే విషయాన్ని గుర్తించాలి. బ్యారేజీల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్‌.. దానికి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లనూ సమర్పించలేదు. సాక్షులను క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశమిచ్చినా ఉపయోగించుకోలేదు. కమిషన్‌ సహజ న్యాయసూత్రాలను పక్కాగా పాటించింది.


  • కాళేశ్వరం కమిషన్‌ నివేదిక కాపీని తనకు అందజేయకుండా మీడియాకు విడుదల చేసిందనే వాదన తప్పు. నివేదికను ప్రభుత్వం మీడియాకు ఇవ్వలేదు. దానిపై నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మంత్రివర్గానికి సులభంగా అర్థం కావడానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను అధికారులు సిద్ధం చేశారు. దానివల్ల పిటిషనర్‌ హక్కులకు ఎలాంటి భంగం కలగలేదు. పిటిషనర్‌ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. మీడియాలో వచ్చే కథనాలపై ఆధారపడకూడదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిన విషయాన్ని పిటిషనర్‌ గుర్తించాలి.

  • అన్ని ప్రభుత్వ రికార్డులను పరిశీలించి, సాక్షులను విచారించిన తర్వాత కమిషన్‌ పిటిషనర్‌ పాత్రపై నివేదికను సమర్పించింది. పిటిషనర్‌ కేసీఆర్‌ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్లు, నీటిని నిల్వ చేయడంపై నిర్ణయాలు తీసుకున్నట్లు, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కమిషన్‌ తేల్చింది. ప్రస్తుత ప్రభుత్వం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తోందనే ఆరోపణల్లో వాస్తవం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ జోక్యం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండదు. ప్రస్తుత కేసులో పరిపాలనాపరమైన లోపాలను, బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా జరిగిన వ్యవహారాలను కమిషన్‌ గుర్తించింది. ఏయే తప్పులకు ఎవరు బాధ్యులు అని చెప్పడం కచ్చితంగా కమిషన్‌ విధుల్లోకే వస్తుంది. ఇది చట్టప్రకారమే జరిగింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ నివేదికను కొట్టేయాలని కేసీఆర్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లకు కాలం చెల్లింది.

కేసీఆర్‌ నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ తీసుకున్న సొంత నిర్ణయాలతో రాష్ట్రానికి నేరపూరిత నష్టం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది. బ్యారేజీల నిర్మాణ ప్రదేశం ఎంపిక, ప్లానింగ్‌లో లోపాలను ఇందులో ఎత్తిచూపింది. పైగా, గంపగుత్త విధానంలో పనులు కట్టబెట్టారని, నిర్ణీత కాలంలో నిర్మాణం చేపట్టనందుకు ఎలాంటి జరిమానాలు విధించకుండా గడువులు పెంచిందని తెలిపింది. బ్యారేజీల నిర్మాణం పూర్తికాకుండానే పూర్తయినట్లు తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేశారని, నిర్ణీత వ్యవధికి ముందే బ్యాంకు గ్యారంటీలు విడుదల చేశారని ఆక్షేపించింది. నిర్మాణ ప్రదేశాల్లో తగిన పరీక్షలు చేయకుండానే డిజైన్లు సిద్ధం చేశారని, డిజైన్లకు విరుద్ధంగా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేశారని పేర్కొంది. బ్యారేజీలు ప్రధానంగా మేడిగడ్డ తీవ్రంగా దెబ్బతిన్నదని గుర్తు చేసింది. ఈ వైఫల్యానికి ప్రధాన కారకుడు కేసీఆర్‌ మాత్రమేనని, ఆఖిల భారత సర్వీసు అధికారులతో పాటు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు బాధ్యులుగా కమిషన్‌ తేల్చిందని వివరించింది. కాళేశ్వరం కమిషన్‌ ఎదుట కేసీఆర్‌ స్వచ్ఛందంగా విచారణకు హాజరయ్యారని, ఇప్పుడు నివేదిక పక్షపాతంతో ఉందనడం సరికాదని పేర్కొంది.

Updated Date - Nov 13 , 2025 | 05:01 AM