MP Laxman: మొన్న కాళేశ్వరం కూలింది.. నేడు బీఆర్‌ఎస్ కూలింది
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:42 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత బాహాటంగానే ఒప్పుకుందని, అందులో కేసీఆర్ పాత్ర ఉందని ఆమె వ్యాఖ్యలతో స్పష్టమైందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మొన్న కాళేశ్వరం కూలింది. నేడు బీఆర్‌ఎస్ కూలింది...
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత బాహాటంగానే ఒప్పుకుందని, అందులో కేసీఆర్ పాత్ర ఉందని ఆమె వ్యాఖ్యలతో స్పష్టమైందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ‘‘మొన్న కాళేశ్వరం కూలింది. నేడు బీఆర్‌ఎస్ కూలింది. మేడిగడ్డ బ్యారేజ్‌లో మూడు పిల్లర్లు కుంగితే.. నేడు బీఆర్‌ఎస్ మూడు ముక్కలైంది’’ అని ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కవిత లాంటి అవినీతిపరులను బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమని చెప్పారు. కాళేశ్వరం కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వకుండా 22 నెలలుగా ఎందుకు కాలయాపన చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కోరిందని, కానీ కాంగ్రెస్ 20 నెలలు తాత్సారం చేసి, చేతగాక ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. మహబూబ్‌నగర్ బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత ఒప్పుకుంటూనే.. కేసీఆర్‌కు సంబంధం లేదని చెప్పడం చోద్యంగా ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తానికి కాళేశ్వరం అవినీతితో సంబంధం ఉందని ఆరోపించారు.