Kadiyam Srihari: స్పీకర్ నిర్ణయాన్ని బట్టి రాజీనామాపై నిర్ణయం
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:03 AM
రాజీనామా విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
ఉప ఎన్నిక వచ్చినా ప్రజలు గెలిపించేది నన్నే: కడియం
ధర్మసాగర్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజీనామా విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం (23వ తేదీ) లోపు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ నోటీసులిచ్చారని, అయితే మరింత సమయం కావాలని ఆయన్ను కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి ఎమ్మెల్యే వేలేరు, ధర్మసాగర్ మండలాలకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కడియం మాట్లాడుతూ.. గత పదేళ్లలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం అధికార పార్టీలో ఉండి కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరేనని దుయ్యబట్టారు. వాళ్లు చేస్తే సంసారం.. వేరే వాళ్లు చేస్తే వ్యభిచారమా.. అని ఘాటుగా విమర్శించారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే పోటీ చేసేది తానేనని.. ప్రజలు గెలిపించేది కూడా తననేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.