Share News

Kadiam Srihari: కేటీఆర్‌కు బలుపు, అహంభావం

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:15 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌కు బలుపు, అహంభావం ఎక్కువని, ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.

Kadiam Srihari: కేటీఆర్‌కు బలుపు, అహంభావం

  • కేసీఆర్‌ కంటే రెండేళ్లే పెద్ద అయిన నన్ను, పోచారంను దుర్భాషలాడుతున్నాడు

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ వస్తే నేనేంటో తెలుస్తుంది

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

స్టేషన్‌ఘన్‌పూర్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌కు బలుపు, అహంభావం ఎక్కువని, ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ‘అరే బిడ్డా కేటీఆర్‌.. మీ నాయన పదేళ్లు సీఎంగా చేస్తే.. నేను 14ఏళ్లు మంత్రిగా పని చేశా. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేశా’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌, ఉప సర్పంచ్‌, వార్డు సభ్యులను ఎంపీ కడియం కావ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతితో కలిసి ఆయన సన్మానించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. తనను, పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని కలిపి కేటీఆర్‌ ‘వీళ్లు ఆడా, మగా’ అంటూ దిగజారి మాట్లాడారని గుర్తు చేశారు. కేసీఆర్‌ కంటే వయస్సులో తామిద్దరం రెండేళ్లు పెద్ద అని చెప్పిన కడియం.. ‘‘నేను ఆడో, మగో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డా.. 143 సర్పంచ్‌లకు వంద సర్పంచ్‌లను గెలిపించుకున్నాం’’ అని వ్యాఖ్యానించారు. సీఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్న ఆయన ఆహ్వానం మేరకే కాంగ్రె్‌సతో కలిసి పనిచేస్తున్నానని కడియంచెప్పారు. రెండేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందునే నియోజకవర్గానికి రూ.1400కోట్ల నిధులు వచ్చాయన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 36మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అందులో ఏ ఒక్కరైనా అనర్హతకు గురయ్యారా అని ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధి పైన దృష్టి సారించకపోవడం వల్లే తాటికొండ రాజయ్యను ప్రజలు రాజకీయ సమాధి చేశారన్నారు. కొంత మంది బీఆర్‌ఎస్‌ నాయకులు ఫ్లెక్సీలలో తన బొమ్మను పెట్టుకుంటున్నారని, అది తనకు సంతోషమేనన్నారు. కడియం ముఖం చూసైన ఓట్లు పడుతాయనివాళ్లు తనఫొటో పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Dec 22 , 2025 | 05:15 AM