Kadiyam Srihari: కేసీఆర్ కుటుంబంలో పల్లా చిచ్చు
ABN , Publish Date - Dec 16 , 2025 | 04:30 AM
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ పంచన చేరి ఆ కుటుంబం మఽధ్య చిచ్చుపెట్టి చిన్నాభిన్నం....
స్టేషన్‌ఘన్‌పూర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్ పంచన చేరి ఆ కుటుంబం మఽధ్య చిచ్చుపెట్టి చిన్నాభిన్నం చేశాడని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పంచన చేరి యూనివర్సిటీ, మెడికల్ కళాశాలను, ఇంజనీరింగ్ కళాశాలను పెట్టుకొని ఆనాటి ప్రభుత్వం అండతో పల్లా ఆస్తులు కూడబెట్టుకున్నారన్నారు. కేసీఆర్ చుట్టూ కొరివి దయ్యాలు చేరాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన కడియం.. ఆ దెయ్యాల్లో పల్లానే పెద్ద కొరివి దయ్యమంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత దూరం కావడం, కేటీఆర్, హరీశ్ మధ్య దూరం పెరగడం.. వీటన్నింటికీ పల్లానే కారణమన్నారు. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య కంటే పల్లా ఎక్కువ గ్రామాల్లో తిరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో రాజయ్య తిరిగితే ఓట్లు రాలవని.. పల్లా వస్తే ఓట్లు, పైసలు వస్తాయని నిలబడిన అభ్యర్థులు ఆయన్ను పిలిపించుకున్నారన్నారు.