Share News

Kadam Srihari: నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్‌ తేలుస్తారు

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:51 AM

తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్‌ నిర్ణయిస్తారని, తనకు అందిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని స్టేషన్‌ఘన్‌పూర్‌...

Kadam Srihari: నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్‌ తేలుస్తారు

  • నోటీసులకు నెలాఖరు వరకు గడువు ఉంది

  • అభివృద్ధి కోసమే కాంగ్రె్‌సతో కలిశా

  • నియోజకవర్గానికి 1,026కోట్లు తెచ్చా

  • ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు: కడియం శ్రీహరి

వరంగల్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్‌ నిర్ణయిస్తారని, తనకు అందిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు నెలాఖరు దాకా సమయం ఉందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 21 నెలల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి రూ.1,026కోట్ల నిఽఽధులు తీసుకొచ్చానని వెల్లడించారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నేతలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని, అయితే స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎ్‌సకు లేదన్నారు. పదేళ్లలో కాంగ్రెస్‌, టీడీపీ, బీఎస్పీ, సీపీఐలకు చెందిన 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని గుర్తు చేశారు. వారిలో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదని, అనర్హత వేటు పడలేదన్నారు. ఫిరాయింపుల అంశం స్పీకర్‌ పరిధిలో ఉందని, ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ పాదాభివందనాలు చేయలేదని, తాను అడుక్కుంటే పదవులు రాలేదని, తన పనితీరు గుర్తించి ఢిల్లీలో ఉన్న తనను పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని పేర్కొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 04:51 AM