Share News

K Laxman: కాంగ్రెస్‌ గెలిస్తేనే ఈవీఎంల పనితీరు బాగున్నట్లా.. రాహుల్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:07 AM

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే ఈవీఎంల తప్పు, ఓట్‌ చోరీ అని అంటారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఆ పార్టీ గెలిచిచింది కదా.. ఆ రాష్ట్రాల్లో ఈవీఎంలు బాగానే పనిచేసినట్లా...

K Laxman: కాంగ్రెస్‌ గెలిస్తేనే ఈవీఎంల పనితీరు బాగున్నట్లా.. రాహుల్‌

  • ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాం: కె. లక్ష్మణ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితే ఈవీఎంల తప్పు, ఓట్‌ చోరీ అని అంటారు. తెలంగాణ, కర్ణాటకల్లో ఆ పార్టీ గెలిచిచింది కదా.. ఆ రాష్ట్రాల్లో ఈవీఎంలు బాగానే పనిచేసినట్లా? ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాటలను ఎలా అర్ధం చేసుకోవాలి’ అని బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్‌ ప్రశ్నించారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో కాంగ్రెస్‌ వరుసగా మూడుసార్లు ఓడిపోవడంతో ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ గెలిచినప్పుడు ఈవీఎంల్లో ఎలాంటి తప్పులు కనిపించవని, బీజేపీ గెలిస్తే మాత్రం ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ముక్కలు చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం మతంతో ముడిపెట్టిందని ఆరోపించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలతో రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. ఈ పథకాన్ని రద్దు చేయడం లేదని, ఉపాధి రోజులు 100 రోజుల నుంచి 125రోజులకు విస్తరించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దగ్గర ప్రజా ప్రయోజనాల కోసం ఎలాటి ఎజెండాలు లేవని విమర్శించారు.

Updated Date - Dec 21 , 2025 | 06:09 AM