Justice Sudarshan Reddy: పాలమూరు కూలీల బతుకులు మారలేదు!
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:17 AM
పాలమూరు కూలీల బతుకులు మారలేదని, పని కావాలంటే ఇప్పటికీ వలస వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి....
పని కావాలంటే వలస వెళ్లాల్సిందే: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
మరికల్‌లో ‘వలస బతుకు’ పుస్తకావిష్కరణ
మరికల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాలమూరు కూలీల బతుకులు మారలేదని, పని కావాలంటే ఇప్పటికీ వలస వెళ్లాల్సిందేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరుకు వలస జిల్లాగా పేరుందన్నారు. గతంలో గుంపు మేస్ర్తీలు కూలీలను వలస తీసుకెళ్లి చాలీచాలని జీతమిచ్చి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణాలను చేయించేవారన్నారు. నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన దివంగత నర్సన్న రచించిన ‘వలస బతుకు (పాలమూరు వలస కూలీ జీవనగాఽథ)’ పుస్తకావిష్కరణ సభకు ఆయనతో పాటు, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ హరగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రచయిత తనయుడు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు వెంకట్రాములు ఆధ్వర్యంలో మరికల్‌లో అదివారం నిర్వహించిన ఆవిష్కరణ సభలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. వలస కూలీగా నర్సన్న తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారన్నారు. ఆనాడు నర్సన్న, భార్యతో పాటు వలస వెళ్లి ప్రత్యక్షంగా అనుభవించిన సంఘటనలపై పుస్తకం రచించడం గర్వకారణమని చెప్పారు. ఈ పుస్తకం చదివిన వారిలో కొద్దిగైనా మార్పు వస్తుందని తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. కుతుబ్‌షాహీల కాలంలో మొదలైన కూలీల వలసలు, నేటికీ కొనసాగుతున్నాయన్నారు. లక్షలాది మంది వలస కూలీలుగా, తరతరాలుగా కష్టపడి దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యారని తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వలసలు ఆగలేదని చెప్పారు. నాటి ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే పాలమూరు తలరాత ఎన్నడో మారేదన్నారు. పుస్తక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ జిల్లాలో ఎంతో మంది కవులు, రచయితలున్నా వలస మీద ఒక్కటంటే ఒక్క నవల రాలేదని.. లక్షల కూలీల్లో ఒకరైన నర్సన్న తన వలస బతుకునే పుస్తకంగా రాశారని చెప్పారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. కళారంగంలో ఇలాంటి వారు తమ అనుభవలను రచించడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, డీజీ హైమావతి, ఎండీ ఇక్బాల్‌పాషా తదితరులు పాల్గొన్నారు.