Justice Sudarshan Reddy: ప్రభుత్వాలు వ్యాపారసంస్థలుగా మారాయి
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:28 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార సంస్థలుగా మారాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.....
ఇండిగో మీద చర్యలు తీసుకోవడం లేదేం?
విశ్రాంత న్యాయమూర్తి బి. సుదర్శన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపార సంస్థలుగా మారాయని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీని పారదోలడానికి పోరాటం సాగించిన ఈ నేల మీద సకల సౌకర్యాలు, వసతులు ఉచితంగా కల్పిస్తూ ఎర్ర తివాచీ పరిచి మరీ విదేశీ వ్యాపారులను ఆహ్వానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడేందుకు కారణమైన ఇండిగో సంస్థ బాధ్యులపై మోదీ ప్రభుత్వం ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతోందని ప్రశ్నించారు. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్ రచనలు ‘ఎక్కడికీ గమనం? ఎంత దూరమీ గమ్యం?’, ‘ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం?’ వ్యాస సంపుటాలు, ‘గోడల వెనుక- జైలు జ్ఞాపకాలు’ పుస్తకాలను ఆదివారం శివం రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు రాజ్యాంగ విలువల మీద కాకుండా దేవాలయ ధర్మధ్వజం మీద ఆధారపడడం శోచనీయమన్నారు. సామాజిక శాస్త్రవేత్త కల్పనా కన్నబిరాన్ మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని మరిచిపోతున్నప్పుడు వారికి ఆ బాధ్యత గుర్తుచేయాల్సింది జన బాహుళ్యమేనన్నారు. సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. ఆలోచనల్లో స్పష్టత కలిగిన అరుదైన సాహిత్య సృజనకారుడు నిఖిలేశ్వర్ అని కొనియాడారు. ఎమెస్కో సంపాదకుడు చంద్రశేఖర్ రెడ్డి పుస్తకాలను పరిచయం చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి, విశ్రాంత ఆచార్యుడు ముత్యంరెడ్డి ప్రస్తుత సామాజిక, రాజకీయ, సాంస్కృతిక స్థితిగతులపై మాట్లాడారు. నిఖిలేశ్వర్ సాహిత్య కృషిని కొనియాడారు.