Justice Sridevi Honored by ATA: జస్టిస్ శ్రీదేవికి ఆటా సన్మానం
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:01 AM
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘనంగా సన్మానించింది. అమెరికాలో పర్యటిస్తున్న జస్టిస్ శ్రీదేవి.. వర్జీనియాలో ఆటా...
అమెరికాలోని వర్జీనియాలో తెలుగు ప్రవాసులతో భేటీ
(డాలస్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఘనంగా సన్మానించింది. అమెరికాలో పర్యటిస్తున్న జస్టిస్ శ్రీదేవి.. వర్జీనియాలో ఆటా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తన అనుభవాలను సభికులతో పంచుకున్నారు. కుటుంబ జీవితాన్ని, న్యాయవ్యవస్థలో వృత్తి జీవితాన్ని సమన్వయం చేస్తూ ప్రైవేటు న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగిన విధానాన్ని వివరించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భారత న్యాయవ్యవస్థపై ప్రవాస తెలుగువారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ట్రస్టీల బోర్డు సభ్యుడు విష్ణు మాధవరం తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరిగే ఆటా 19వ కాన్ఫరెన్స్‌తోపాటు భారత్‌లో ఆటా నిర్వహించబోయే సమావేశానికి జస్టిస్ శ్రీదేవిని సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అంతకుముందు ఆమె వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ భవనాన్ని (అమెరికా పార్లమెంటు భవనం) సందర్శించి, అమెరికా పార్లమెంటులో బిల్లుల ఆమోద ప్రక్రియను పరిశీలించారు. 1810 నుంచి 1860 వరకు ఆ దేశ సుప్రీంకోర్టుగా కొనసాగిన భవన సముదాయాన్ని సందర్శించారు. న్యూజె ర్సీ పర్యటనలో ప్రఖ్యాత అక్షరధామ్ ఆలయాన్ని కుటుంబసమేతంగా సందర్శించి పూజలు చేశారు.

