Share News

Justice Radharani: విమానాల ఆలస్యంపైనా కేసులు వేయొచ్చు

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:35 AM

మా ఉత్పత్తి వాడితే మూడు నెలల్లో ఎత్తు పెరుగుతారుమేమిచ్చిన ఆహారం తింటే నెలల వ్యవధిలో స్లిమ్‌ అవుతారు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న మా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటే స్వర్గంలో....

Justice Radharani: విమానాల ఆలస్యంపైనా కేసులు వేయొచ్చు

  • వైద్యం సరిగా అందకున్నా, బీమా ఇవ్వకున్నా తప్పే

  • వస్తు, సేవలు, రియల్టీ.. ఏ రంగంలో నష్టపోయినా, మోసపోయినా ఫోరంను ఆశ్రయించవచ్చు

  • వినియోగదారుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): మా ఉత్పత్తి వాడితే మూడు నెలల్లో ఎత్తు పెరుగుతారుమేమిచ్చిన ఆహారం తింటే నెలల వ్యవధిలో స్లిమ్‌ అవుతారు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న మా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొంటే స్వర్గంలో ఉన్నట్టే వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయానికి ఈ తరహా వాణిజ్య ప్రకటనలను హోరెత్తిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఆ ప్రకటనల్లో చూపించినదానికి వాస్తవానికి సంబంధమే ఉండదు. ఇదేమని అడిగితే సరైన సమాధానమూ ఉండదు. ఇలాంటి వ్యాపారాలే కాదు.. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇండిగో సంస్థ వ్యవహారం కూడా అంతే. ఆఖరి నిమిషంలో సర్వీసుల రద్దుతో విమాన ప్రయాణీకులు ఎన్ని పాట్లు పడ్డారో కళ్లారా చూశాం. ఆస్పత్రులకు వెళ్లినా సరైన వైద్యం అందడం లేదు. ఫీజుల కింద రూ.లక్షలు తీసుకొని కడుపులో దూది, కత్తి వంటి వాటిని వదిలేసి కుట్లేసిన వైద్యులను చూస్తున్నాం. అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుందని పాలసీలు తీసుకుంటే.. బీమా సౌకర్యం ఉంది కదా ! అనే భరోసాకు తూట్లు పొడుస్తున్న ఘటనలు వింటున్నాం. మరి ఇలాంటి వాటిపై ఏం చేయాలి? వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. అయితే, వినియోగదారులకు ఉన్న హక్కులేంటి? వినియోగదారులు కేసులు ఎలా వేయాలి ? తదితర అంశాలపై తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ అఽధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జస్టిస్‌ రాధారాణి ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలు..

చట్టం దృష్టిలో వినియోగదారుడు అంటే ఎవరు? ఏ రంగంలో నష్టం జరిగితే మీ దగ్గరకు రావొచ్చు?

ఒక వస్తువు కొనుగోలు చేసిన వ్యక్తి, ఒక సేవను పొందిన వ్యక్తి, ఒక ప్రకటన చూసి సదరు ఉత్పత్తి, సేవను కొనుగోలు చేసిన వ్యక్తి ఎవరైనా వినియోగదారుడే. ఏవైనా ఉత్పత్తుల వల్ల వినియోగదారులకు నష్టం జరిగితేనే వినియోగదారుల కమిషన్‌కు అనే భావన ఉండేది. కానీ అది సేవా రంగానికి కూడా వర్తిస్తుంది. మభ్యపెట్టే ప్రకటనలతో వినియోగదారులను ఆకట్టుకుని మోసం చేయడం, తప్పుడు ప్రచారంతో వస్తువులు అమ్మి...తీరా వాటిని ఆ మేరకు ఇవ్వకపోవడం ఇవన్నీ చట్ట పరిఽధిలోకి వస్తాయి. ఆయా అంశాల్లో ఎవరు మోసపోయినా, నష్టపోయినా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లను ఆశ్రయించవచ్చు. బ్యాంకింగ్‌, బీమా, హోటళ్లు, ఆస్పత్రులు, ట్రావెల్‌, టూరిజం ఏ రంగాల్లోని సేవల్లో లోపం, నష్టం జరిగినా కేసులు నమోదు చేయొచ్చు.


రియల్‌ఎస్టేట్‌ బాధితులకు రెరా ఉందిగా. మీ దగ్గరకు కూడా రావొచ్చా? ఇండిగో బాధితులూ కేసులు వేయొచ్చా?

రియల్‌ఎస్టేట్‌లో జరిగిన మోసాలు, కాంట్రాక్టుల ఉల్లంఘన కింద కూడా వినియోగదారులు మా దగ్గర కేసులు వేయొచ్చు. రెరాలోను వేయొ చ్చు. ఇక్కడకూ రావొచ్చు. నిర్ణీత కాలంలో నిర్మాణం పూర్తి చేసి ఇస్తామని ఇవ్వకున్నా, మోసం చేసి అమ్మకాలు చేసినా, .కల్పిస్తానన్న సౌకర్యాలు కల్పించకున్నా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చు. ఇండిగో విమానాలే కాదు... ఏ విమానయాన సంస్థ వల్ల నష్టపోయినా ఫోరంలో కేసు వేయవచ్చు.

వినియోగదారుల కమిషన్ల వ్యవస్థ మూడంచెల్లో ఉంది కదా! ఏ అంచెలో ఏ కేసు వేయాలి?

జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వినియోగదారుల కమిషన్లు ఉన్నాయి. జిల్లా స్థాయిలో రూ.50లక్షల లోపు విలువున్న మోసానికి సంబంధించిన కేసులు, రాష్ట్ర స్థాయిలో రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల వరకు విలువున్న కేసులు, అంతకంటే ఎక్కువ విలువ ఉన్న వాటిపై జాతీయస్థాయి వినియోగదారుల కమిషన్‌లలో కేసులు వేయొచ్చు.

కేసులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలనే నిబంధన ఉందా ? ఉంటే.. అమలవుతుందా ?

వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం ఓ కేసును మూడు నెలల్లో పరిష్కరించాలి. కానీ అది సాధ్యం కావడం లేదు. చాలా కేసులు ఎక్కువ సమయమే తీసుకుంటున్నాయి. సగటున ఏడాదికి పైగా సమయం పడుతోంది. అంతేకాదు.. ఇందులో మళ్లీ అప్పీళ్లు కూడా ఉంటాయి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, అక్కడి నుంచి జాతీయస్థాయి వరకు అప్పీలుకు వెళ్లొచ్చు. ఆపై, సుప్రీం కోర్టుకు కూడా వెళ్లొచ్చు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర స్థాయిలో సుమారు 3,400, అన్ని జిల్లాల్లోను కలిపి 4,000 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.


ఫోరంలో బాధితులు స్వయంగా వాదించుకోవచ్చా? తెలుగులో వాదనలు వినిపించవచ్చా?

కేసు వేసిన వినియోగదారులు తమ వాదనలను స్వయంగా వినిపించుకోవచ్చు. తెలుగులో వాదనలు వినిపించవచ్చు. తెలుగులోని కాదు ఏ స్థానిక భాషలోనైనా వాదనలు వినిపించవచ్చు. న్యాయవాదులను కూడా పెట్టుకోవచ్చు. కేసుల కోసం కోర్టు ఫీజు కూడా రూ.10మాత్రమే.

ఈ-జాగృతి పోర్టల్‌ ఏమిటి? అదెలా ఉపకరిస్తుంది?

జాతీయ స్థాయిలో ఎక్కడనుంచైనా ఆన్‌లైన్‌లోనే వినియోగదారుల ఫోరంలలో కేసులు వేసేందుకు ఈ-జాగృతి పోర్టల్‌ను తెచ్చారు. అయితే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు, నిరక్ష్యరాస్యుల నుంచి కూడా కేసులు వస్తాయి. ప్రస్తుతానికి ఇలాంటివారంతా నేరుగా కమిషన్‌లకు వచ్చి కేసులు ఫైల్‌ చేస్తున్నారు. ఈ-జాగృతి ద్వారా కేసులు నమోదు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఒక టోల్‌ఫ్రీ నెంబరు 1915 ను ఏర్పాటుచేశాం. 1915కి ఫోన్‌ చేసి కూడా ఫిర్యాదులు చెయ్యవచ్చు.

కమిషన్లలో కేసులు వేయాలనుకునేవారు, టోల్‌ఫ్రీ ద్వారా ఫిర్యాదు చేసేవారు ఏ పద్ధతి అనుసరించాలి?

ముందుగా టోల్‌ఫ్రీ ద్వారా ఫిర్యాదులు చేసేవారికి కొన్ని సూచనలు చెప్తా. ఓ వినియోగదారుడు ఒక కంపెనీ ఉత్ప్తతని కొనుగోలు చేశాడనుకుందాం. దానిలో మోసం, లేదంటే ప్రమాణాల్లో లోపం ఉందనుకుందాం. అతను వెంటనే సదరు కంపెనీ టోల్‌ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చెప్పాలి. ప్రతి ఉత్పత్తి, సేవా కంపెనీలకు ఇప్పుడు ఇలా టోల్‌ఫ్రీ నెంబర్లు ఉంటున్నాయి. అక్కడ ఫిర్యాదు చేసినా పరిష్కరించకపోతే... అప్పుడు 1915 టోల్‌ఫ్రీ నెంబరుకు చేసి ఫిర్యాదు చేయాలి. అప్పుడు వారు సదరు కంపెనీతో మాట్లాడి వినియోగదారుడికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు. ఇక రెండోది...నేరుగా వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేసేవారు. వీరు తాము కొనుగోలు చేసిన వస్తువులు, పొందిన సేవలకు సంబంధించిన రశీదులు పెట్టుకోవాలి. వాటికి సంబంధించి ఇంకా ఏమైనా వివరణ పత్రాలు, హామీలుంటే దాచుకోవాలి. ఉదాహరణకు వారెంటీ పత్రాలు. అయితే సమర్పించాల్సిన ఆధారాలు ఎవిడెన్స్‌ యాక్ట్‌లో అంత పకడ్బందీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయా రశీదులు, అవి ఎందుకు నష్టం కలిగించాయో తెలిపేవి ఉంటే చాలు.

వినియోగదారుల కమిషన్‌లకు మౌలిక వసతులు, సిబ్బంది కొరత ఉందా?

చట్ట ప్రకారం జిల్లా వినియోగదారుల కమిషన్లకు అధ్యక్షులుగా జిల్లా జడ్జిలుగా చే సిన వారిని నియమించాలి. ప్రస్తుతం ఒక్క జిల్లాలో కూడా అలాంటివారు లేరు. అనుభవమున్న న్యాయవాదులు, వినియోగదారుల కేసుల్లో పని చేసిన అనుభవం ఉన్న స్వచ్చందసంస్థల వారు అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఈ-జాగృతి పోర్టల్‌ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునేవారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కొంతమంది సిబ్బంది ఉంటే బాగుంటుంది. అన్ని స్థాయిల్లోను అలా సలహాలిచ్చేవారుంటే.. ఆన్‌లైన్‌లో తేలిగ్గా ఫిర్యాదులు చేసుకోవడానికి ప్రజలు మొగ్గుచూపుతారు.

Updated Date - Dec 27 , 2025 | 04:35 AM