BJP Telangana president Ramchander Rao: మోదీతోనే సిక్కులకు న్యాయం
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:01 AM
సిక్కులకు ప్రధాని మోదీ నాయకత్వంలోనే న్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సిక్కులకు ప్రధాని మోదీ నాయకత్వంలోనే న్యాయం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. సిక్కుల దశమ గురువు గురు గోవింద్ సింగ్ కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేసింగ్ త్యాగాలను స్మరిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ‘వీర్‌బాల్ దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పూర్తి చేసి, పాకిస్థాన్‌లోని గురుద్వారాలకు సిక్కులు వెళ్లే అవకాశం కల్పించిందన్నారు. పంజాబ్‌లోని పలు సిక్కు పవిత్ర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు. ‘నాడు మొఘల్ పాలకులు బలవంతంగా మత మార్పిడికి ప్రయత్నించినప్పుడు ఏడేళ్లు, తొమ్మిదేళ్ల వయస్సు గల బాబా జోరావర్ సింగ్, బాబా ఫతేసింగ్.. ‘మేం మా ధర్మాన్ని వదలం. మా విశ్వాసాన్ని త్యజించం’ అని ఎదురు నిలిచారన్నారు. చిన్న వయస్సులోనే వారి ధైర్యం, త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్న రాంచందర్‌రావు.. వారి బలిదానాన్ని భావి తరాలు గుర్తుంచుకోవాలనే దేశవ్యాప్తంగా వీర్ బాల్ దివస్ నిర్వహిస్తున్నామన్నారు.