Engineering Promotions: ఆ డీఈఈనే చీఫ్ ఇంజినీర్!
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:27 AM
ఎం.బాలు.. ఈయనది అసలు పోస్టింగ్ ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్‌లో! ఈయన హోదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్...
ఎస్‌ఈగా ఒక్క రోజైనా అనుభవం లేకుండా సీఈ పోస్టు కట్టబెట్టారు
గిరిజన సంక్షేమ శాఖలో కీలక పోస్టుల్లో డీఈఈలే చలామణీ
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎం.బాలు.. ఈయనది అసలు పోస్టింగ్ ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్‌లో! ఈయన హోదా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ). ఈయనకే గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్‌లో మైదాన ప్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలు తిరగకుండానే గత నెల 30న ఏకంగా హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ)తో సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ)గా నియమించారు. అదే రోజున ఇంజినీరింగ్ విభాగంలో కీలకమైన రాష్ట్రస్థాయి చీఫ్ ఇంజినీర్(సీఈ)గా కూడా బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి ఒక్క రోజైనా ఎస్‌ఈగా పనిచేసిన అనుభవం ఆయనకు లేదు. బాలు అనే డీఈఈనే సీఈగా రూ.50 లక్షలకు పైబడిన.. వేల కోట్ల విలువైన టెండర్ల సాంకేతిక అంచనాలు తయారుచేసి ఎస్‌ఈకి పంపితే ఆయన టెండర్లు పిలుస్తారు. ఈఈగా చెక్ పవర్‌తో కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తారు. ఎందుకిలా అని ఎవరైనా అడిగితే పరిపాలనా సౌలభ్యం కోసం తప్పదని ఉన్నతాధికారులు టక్కున చెప్పే సమాధానం. ఈయనతో పాటు మరో ఇద్దరు డీఈఈలు కూడా రెండేసి పదవుల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ సబ్ డివిజన్‌లో డీఈఈగా పనిచేసే ఆర్డీ ఫణికుమారికి చీఫ్ ఇంజినీర్ కార్యాలయంలో ప్లానింగ్ అండ్ మానిటరింగ్ ఈఈ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆమెను వరంగల్ ఎస్‌ఈగా కూడా నియమించారు. ఇలా గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగంలో 82 పోస్టులు ఖాళీగా ఉండగా కిందిస్థాయి అధికారులకే కీలకమైన ఉన్నతస్థాయి పోస్టులు అప్పగిస్తున్నారు. ఐటీడీఏల్లో కూడా 208కిగాను 166 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో అధికారి రెండు మూడు పోస్టుల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారు.