Victory Elevates CM Revanth Reddy: ఇక రేవంత్ 2.0
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:16 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాధినేతగానే కాక, కాంగ్రెస్ పార్టీలోనూ శక్తిమంతుడిగా మారిపోయారు. బిహార్‌లో కాంగ్రెస్ చావు దెబ్బ తిన్న నేపథ్యంలో, రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో ఆ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం...
జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపుతో మారిన సీన్
అధిష్ఠానం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి పెరగనున్న ప్రాధాన్యం
రేవంత్ నిర్ణయాలకు తప్పక అండగా నిలవాల్సిన పరిస్థితి
రాష్ట్రంలో పాలనా పరంగా కఠినంగా వ్యవహరించనున్న సీఎం
త్వరలో మంత్రివర్గ సమూల ప్రక్షాళన.. కొత్తవారికి అవకాశం
పనితీరు బాగాలేని మంత్రుల నుంచి కీలక శాఖలు వెనక్కి
మూసీ రివర్ ఫ్రంట్, ఫోర్త్ సిటీ, విజన్ 2047పై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాధినేతగానే కాక, కాంగ్రెస్ పార్టీలోనూ శక్తిమంతుడిగా మారిపోయారు. బిహార్‌లో కాంగ్రెస్ చావు దెబ్బ తిన్న నేపథ్యంలో, రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో ఆ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో విజయం సాధించడం... అధిష్ఠానం వద్ద రేవంత్ ప్రాధాన్యాన్ని తప్పక పెంచుతుందని విశ్లేషకులు, పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా రేవంత్ నిర్ణయాలకు, ఆయన ప్రతిపాదించిన విజన్ 2047కు కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతివ్వక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు లిట్మస్ టెస్ట్ అంటూ ప్రకటించి మరీ గెలిపించడంతో ఇటు ప్రభుత్వం, అటు పార్టీపైన పూర్తిస్థాయి పట్టు సాధించేందుకు రేవంత్‌కు ఆస్కారం ఏర్పడిందని విశ్లేషిస్తున్నారు. ఇదే అదనుగా.. అధిష్ఠానం అండతో మంత్రివర్గంలో పెద్ద ఎత్తున ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి ఉపక్రమించనున్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో ఉంటుందని అంటున్నారు. మంత్రుల శాఖలనూ సమూలంగా మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి మంత్రుల శాఖల్లో పనితీరుపై ఇప్పటికే సమీక్షించిన అధిష్ఠానం.. పలువురు సీనియర్ మంత్రులు తమ శాఖల నిర్వహణలో వెనుకబడినట్లుగా నివేదిక ఇచ్చింది. కీలక శాఖల్లో పనితీరు బాగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. దీంతో, రేవంత్ ఆయా మంత్రుల నుంచి కీలక శాఖలను తప్పించనున్నట్లు చెబుతున్నారు. అలాగే కొందరు మంత్రుల శాఖల పనితీరుతో పాటు ఆయా మంత్రుల వ్యవహార శైలిపైనా విమర్శలున్నాయి. వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించేందుకూ ఆస్కారం ఉంది.
అభ్యర్థి ఎంపిక నుంచి వ్యూహాత్మకంగానే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు లిట్మస్ టెస్ట్ అని ముందే ప్రకటించిన రేవంత్.. అభ్యర్థి ఎంపిక నుంచీ ఎన్నికల్లో గెలుపు దాకా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బీసీ నేత, స్థానికంగా పట్టున్న నాయకుడు నవీన్‌యాదవ్‌ను అభ్యర్థిగా అధిష్ఠానానికి సిఫార్సు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించి.. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను డివిజన్ల వారీ ఇన్‌చార్జులుగా నియమించి వారికి అటాచ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల నాటికి ఈ టీమ్.. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసింది. స్థానికులను విస్తృతంగా కలిసి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేసింది. ఒకట్రెండు సర్వేలు బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపడంతో అలర్ట్ అయిన రేవంత్.. మంత్రులు, పార్టీ నేతలనూ అలర్ట్ చేశారు. డివిజన్ల వారీగా మంత్రులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ప్రచార ఉధృతిని పెంచారు. తానూ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు.
కొత్త ఏడాదిలో రేవంత్ మార్కు పాలన
అధిష్ఠానం అండ, పాలనపైన పట్టుతో కొత్త ఏడాదిలో సీఎం రేవంత్‌రెడ్డి తన మార్కు పాలన చూపించబోతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వందేళ్ల ప్రగతి కోసం రూపొందించుకున్న విజన్ 2047 అమలుపైన దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు. అభివృద్ధి ప్రణాళికలతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. దానికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్, ఫోర్త్ సిటీ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే అన్ని వర్గాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో ఆ రెండు ప్రాజెక్టులూ ప్రణాళికల వద్దే ఆగిపోయాయి. ఇప్పుడు రేవంత్ వాటిని పట్టాలెక్కించనున్నట్లు చెబుతున్నారు. ’
ఇప్పటిదాకా సమన్వయానికే సమయం
డిసెంబరులో సీఎం రేవంత్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. అయితే ఒక జాతీయ పార్టీ ప్రభుత్వాధినేతగా మంత్రులు, పాలనపైన పట్టు సాధించడానికే ఆయనకు ఈ సమయం సరిపోయింది. అటు అధిష్ఠానాన్ని, ఇటు పార్టీని, సీనియర్ మంత్రులనూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ క్రమంలో చాలా అంశాల్లో సీఎం రేవంత్ తగ్గాల్సి వచ్చింది. పలు శాఖల్లో మంత్రుల పనితీరుతో ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడినా భరించాల్సి వచ్చింది. మరోవైపు, ప్రతిపక్ష నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నా.. తిప్పి కొట్టడానికి ఆయా మంత్రులు ముందుకు రాలేదు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టడంలో, ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రచారాన్ని ప్రజలదాకా తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగం సహకారం ఆశించిన మేరకు లేదన్న విమర్శలు ఉన్నాయి. సహకారం అందించక పోగా ఫెయిల్యూర్ సీఎం అన్న ప్రచారాన్ని పలువురు మంత్రులు, నేతలు అధిష్ఠానం దాకా తీసుకెళ్లారన్న వార్తలూ వచ్చాయి. అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్రాభివృద్ధిపై తన విజన్ ఏమిటో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఈ పరిణామాలు అడ్డంకులుగా మారాయి. దీంతో ఈ రెండేళ్లూ ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, పార్టీ యంత్రాంగంపైన పట్టు సాధించడానికే సరిపోయింది.