Drone Surveillance: పోలింగ్ డే.. డ్రోన్ల నిఘా!
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:14 AM
ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగేలా రాష్ట్రంలోనే తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా పెడుతున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి...
హైదరాబాద్ సిటీ, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగేలా రాష్ట్రంలోనే తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా పెడుతున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, సోమవారం రాత్రిలోపు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకుంటాయని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు సోమవారం కూడా ఇంటింటి ప్రచారం నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఆదివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి కర్ణన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 226 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించామని, అక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులున్న దృష్ట్యా.. ఎన్నికల్లో 4 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు పోలింగ్ సమయమని.. సా యంత్రం 6లోగా కేంద్రానికి వచ్చి క్యూలో ఉన్నవా రికి ఓటేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.
డ్రోన్‌లు, వెబ్ కాస్టింగ్‌తో..
మొత్తం 139 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉ న్నాయని, ఒక్కోచోట ఒక్కో డ్రోన్‌తో నిరంతర నిఘా ఉంటుందని కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల లోపల వెబ్ క్యాస్టింగ్ ద్వారా.. బయట, పరిసరాలను డ్రోన్లతో రికార్డు చేస్తామని చెప్పారు. వాటన్నింటినీ జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి.. ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని వివరించారు. ఉప ఎన్నికలో మొత్తం 561 కంట్రోల్ యూనిట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్‌లు వినియోగిస్తున్నామని.. మొత్తం 2,060 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 1,761 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని జాయింట్ పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 27 కేసులు, ఇతర వివిధ కారణాలపై 2,600 కేసులు నమోదైనట్టు చెప్పారు. ప్రచారం ముగియడంతో నియోజకవర్గంలోని స్థానికేతరులను తక్షణమే ఖాళీచేసి వెళ్లాలని ఆదేశించినట్టు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు నియోజకవర్గ పరిధిలోని మద్యం దుకాణాలను మూసి ఉంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్టు వెల్లడించారు.