Congress victory in the Jubilee Hills by-election: కాంగ్రెస్‌లో గెలుపు జోష్!
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:06 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌లో జోష్ నింపింది. ఆ పార్టీ స్థానిక ఎన్నికలకూ వెళ్లే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తాజా ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీలా పడటంతో ఇదే ఊపులో స్థానిక ఎన్నికలకు వెళ్తే మంచిదన్న....
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో ఇక ‘స్థానికం’పై నజర్
పంచాయతీ నుంచి కార్పొరేషన్ల వరకు మార్చిలోపే జరిగే చాన్స్?
జీహెచ్‌ఎంసీని 2 నుంచి 4 కార్పొరేషన్లుగా విభజించే చాన్స్
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌లో జోష్ నింపింది. ఆ పార్టీ స్థానిక ఎన్నికలకూ వెళ్లే కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తాజా ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం డీలా పడటంతో ఇదే ఊపులో స్థానిక ఎన్నికలకు వెళ్తే మంచిదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రయత్నాల్లో ఉన్న ప్రభుత్వం.. పంచాయతీ, పరిషత్, మునిసిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలను కొంతకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై డిసెంబర్‌లో తుది ప్రయత్నం చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అయితే సీఎం రేవంత్ పాలనా వైఫల్యంతో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతున్నారని బీఆర్‌ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ.. ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ సిటింగ్ సీటునే కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ పరిషత్‌లు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లూ దక్కించుకోవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటు స్థానిక ఎన్నికలకు వెళ్తేనే మేలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ ముఖ్యులు పడినట్లు తెలుస్తోంది. డిసెంబరు 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై తుది ప్రయత్నంగా ఒత్తిడి కార్యాచరణ అమలు చేసి.. బీసీ చాంపియన్‌గా నిలవాలని, అనంతరం స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వ పెద్దలు పరిశీలిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో సీఎం రేవంత్ నిర్వహించనున్న సమావేశంలో దీనిపై స్పష్టత రానుంది. కాగా.. ఉప ఎన్నిక గెలుపుతో జనవరిలో ప్రారంభించి మార్చిలోపు అన్ని స్థాయుల్లోని స్థానిక ఎన్నికల నిర్వహణను ప్రభుత్వం పూర్తి చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్ కంచుకోట అయిన జూబ్లీహిల్స్‌లో అధికార పార్టీని ప్రజలు ఆదరించినప్పుడు.. స్థానిక ఎన్నికల్లోనూ ఆదరిస్తారని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఉప ఎన్నికలో గెలుపు ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని తెస్తుందని అంటున్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ప్రభావం..
గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు గెలవని కాంగ్రె్‌సకు.. కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలుపుతో ప్రాతినిధ్యం దక్కినట్లయింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దక్కిన ఘన విజయం ప్రభావం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపైనా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి నెలలో జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీ కాలం ముగియనుంది. అయితే నగర విస్తరణ, ఫోర్త్ సిటీ ఏర్పాటు దృష్ట్యా జీహెచ్‌ఎంసీని 2 నుంచి 4 కార్పొరేషన్లుగా విభజించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. రెండే కార్పొరేషన్లయితే హైదరాబాద్, సైబరాబాద్‌లుగానూ.. మూడైతే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లుగానూ, నాలుగు కార్పొరేషన్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, శంషాబాద్ కార్పొరేషన్లుగానూ విభజించాలన్న ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో ఈ ప్రణాళికనూ అమలు చేసి త్వరితగతిన ఎన్నికలు నిర్వహించే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.