Jubilee Hills by Election: మైసూరు బొండాలో మైసూరులా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే లేదు!
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:34 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ పేరు చెప్పగానే సినీ, రాజకీయ ప్రముఖులు...
సినీ, రాజకీయ ప్రముఖులు, వీఐపీలకు సంబంధం లేని ఉపఎన్నిక
బంజారాహిల్స్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్ పేరు చెప్పగానే సినీ, రాజకీయ ప్రముఖులు, సంపన్నులు, వీఐపీలు నివసించే ప్రాంతమనే గుర్తింపు ఉండడమే ఇందుకు కారణం. కానీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు జూబ్లీహిల్స్ ప్రాంతానికి, ఆ వీఐపీలకు అసలు సంబంధమే లేదన్నది నమ్మలేని నిజం. ఎందుకంటే.. మైసూరు బొండాలో మైసూరు లేనట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో జూబ్లీహిల్స్ ప్రాంతమే లేదు. అంతేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 114వ వార్డు జూబ్లీహిల్స్ డివిజన్‌లో ఉంది కానీ ఆ వార్డు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి రాదు. అవును.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏడు డివిజన్లు షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసు్‌ఫగూడ, సోమాజిగూడ ప్రాంతాలే ఉన్నాయి. అందువల్ల జూబ్లీహిల్స్‌లో నివసించే సినీ రాజకీయ ప్రముఖులకు ఉపఎన్నిక జరిగే ప్రాంతంతో సంబంధమే లేదు. వారిలో చాలా మంది ఖైరతాబాద్ నియోజకవర్గం ఓటర్లే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసలు వీఐపీలే లేరు. ఉన్నవారంతా సాధారణ, మధ్యతరగతి ప్రజలే. నియోజకవర్గంలో సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా ఉపఎన్నిక బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, మరో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే స్థానిక ఓటర్లు. ఓ రకంగా చెప్పుకోవాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వీరే ప్రముఖులు. నియోజకవర్గంలో బస్తీలే అధికంగా ఉన్నాయి. విద్యావంతులు అధికంగా ఉన్నా అందరూ సామాన్యులే. ఇక, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కూడా తక్కువే. ఇటీవల పోలీసుస్టేషన్‌ల పునర్విభజన చోటు చేసుకోవడం వల్ల నియోజకవర్గంలో మధురానగర్, బోరబండ పోలీసుస్టేషన్లు ఏర్పాటయ్యాయి. గతంలో పక్క నియోజకవర్గం పోలీసుస్టేషన్ సిబ్బందే ఇక్కడ విధులు నిర్వహించేవారు. ఈ రెండు పోలీసుస్టేషన్లే కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉన్న పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, టోలిచౌకి, ఫిలింనగర్ పోలీసుస్టేషన్ల పరిధిలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రాంతాలు ఉన్నాయి. రెవెన్యూ సంబంధిత సేవలకు ఖైరతాబాద్‌లో ఉన్న ఖైరతాబాద్, షేక్‌పేట మండలాలకు, సనత్‌నగర్ నియోజకవర్గంలోని ఉన్న అమీర్‌పేట మండలాన్ని ఆశ్రయించాల్సిందే. యూసు్‌ఫగూడలో చిన్నపాటి వార్డు కార్యాలయం తప్పితే ప్రత్యేక ప్రభుత్వ కార్యాలయాలే లేవు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం స్థితి, పరిస్థితి.