Spurs Rapid Development in Kolluru: ఎన్నికలు అక్కడ.. ఓటర్లు ఇక్కడ!
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:10 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం.. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నివాసముంటున్న వారికి వరంగా మారింది. జూబ్లీహిల్స్‌కు చెందిన...
కొల్లూరులోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల వారికి వరంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
జూబ్లీహిల్స్‌కు చెందిన 3 వేల మందికిగతంలోనే కొల్లూరులో ‘డబుల్’ ఇళ్లు
అక్కడ కోడ్ లేపోవడంతో మంత్రులహామీలు.. 24 గంటల్లోనే కార్యరూపం
10 రేషన్ దుకాణాలు ప్రారంభం
4 అంబులెన్స్‌లు.. ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
రామచంద్రాపురం టౌన్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం.. పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలో నివాసముంటున్న వారికి వరంగా మారింది. జూబ్లీహిల్స్‌కు చెందిన పలు కుటుంబాలకు గతంలో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశారు. దీంతో వారంతా ఆ ప్రాంతానికి వెళ్లి నివాసముంటున్నారు. ఈ కుటుంబాలన్నింట్లో కలిపి సుమారు 3వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే కొల్లూరులోని ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో కనీస సదుపాయాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. విద్య, వైద్యం, రేషన్, పోలీస్, రవాణా వంటి సౌకర్యాలేవీ లేవు. పైగా, వీఎస్టీ వారి సీఎ్‌సఆర్ నిధులు రూ.10 కోట్లతో ఈ ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాల భవన నిర్మించాలని తలపెట్టగా.. మంత్రి, ఎమ్మెల్యే మధ్య ప్రొటోకాల్ వివాదం అడ్డంకిగా మారింది. ఆరు నెలలుగా భవన నిర్మాణానికి అనుమతులు లభించడంలేదు. బీపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ ఆటంకాలన్నీ తొలగిపోయాయి. అన్ని సౌకర్యాలూ ఆగమేఘాలపై సమకూరాయి. ఈ నెల 3న (సోమవారం) మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, దామోదర్ రాజనర్సింహ ఇక్కడికి వచ్చి.. ఈ పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ.. కొల్లూరు డబుల్ బెడ్‌రూం ఇళ్ల సముదాయంలో బస్తీ దవాఖానా, అంబులెన్స్‌లు, పోలీస్ ఔట్‌పోస్ట్, పది రేషన్ దుకాణాలు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
24 గంటల్లోనే హామీల అమలు..
మంత్రులు హామీ ఇచ్చిన 24 గంటల్లోనే చాలా వరకు అమలులోకి వచ్చాయి. డబుల్ బెడ్‌రూం ప్రాంగణంలో 10 రేషన్‌దుకాణాలను ప్రారంభించారు. అప్పటికప్పుడు రెండు లారీల బియ్యం వచ్చాయి. రేషన్‌కార్డుల ఆధారంగా బియ్యాన్ని అందజేశారు. 4 అంబులెన్స్‌లు సమకూర్చారు. బస్తీ దవాఖానాకు డాక్టర్ అర్చనారెడ్డికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులు సైతం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ప్రాంగణం మీదుగా వెళ్తున్నాయి. మరోవైపు.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గురువారం కొల్లూరు డబుల్‌బెడ్‌రూంఇళ్ల ప్రాంగణంలో పర్యటించనున్నారు.