Results Expected by Noon: 10 రౌండ్లు.. 42 టేబుళ్లు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:22 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది...
‘జూబ్లీహిల్స్’ లెక్కింపు రేపే..
ఉదయం 8 గంటలకు ప్రారంభం.. 12 గంటలకు పూర్తి
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది. నియోజకవర్గంలో 407 పోలింగ్ కేంద్రాలుండగా.. పది రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా 14 టేబుళ్లపై కౌంటింగ్ జరుగుతుంది. ఉప ఎన్నిక కావడం, ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి, ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతిస్తారు. తొలుత 10 హోం ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీసు ఓట్లతో లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8.45 గంటలకల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
48.49ు పోలింగ్ నమోదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం లెక్క తేలింది. 48.49 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.సాయిరాం తెలిపారు. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల నుంచి వివరాలు సేకరించి, బుధవారం అధికారికంగా పోలింగ్ శాతం ప్రకటించారు. 2023లో 47.58ు నమోదు కాగా.. ఈ సారి 0.91 శాతం అధికంగా ఓటింగ్ జరిగింది.