Share News

Jubilee Hills By Election Witnessed: జూబ్లీహిల్స్‌లో భారీగా నామినేషన్లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:35 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికిపైగా నామినేషన్లు వేశారు...

Jubilee Hills By Election Witnessed: జూబ్లీహిల్స్‌లో భారీగా నామినేషన్లు

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన మంగళవారం ఒక్కరోజే 160 మందికిపైగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13న నామినేషన్ల స్వీకరణ మొదలవగా 18 వరకు 94 మంది అభ్యర్థులు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆదివారం, దీపావళి పండుగతో రెండు రోజులు సెలవు దినాలు కావడంతో నామినేషన్ల స్వీకరణ జరగలేదు. చివరి రోజైన మంగళవారం అభ్యర్థులు పోటెత్తారు. పలు అంశాల విషయంలో ప్రభుత్వంపై నిరసన తెలిపే వేదికగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్ల దాఖలుకు అవకాశముండటం, అభ్యర్థులు పెద్దసంఖ్యలో రావడంతో అధికారులు టోకెన్‌ విధానం ఏర్పాటు చేశారు. నామినేషన్‌ వేసేవారికి ముందు టోకెన్‌ ఇచ్చి.. అనంతరం నామపత్రాలు స్వీకరించారు. 188 మందికి టోకెన్లు ఇచ్చారు. రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్లు దాఖలు కాగా, ఆ తరువాత కూడా ప్రక్రియ కొనసాగింది. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 250కి పైగా నమోదయ్యే అవకాశం ఉంది.

మూకుమ్మడి నామినేషన్లు..

నామినేషన్లు దాఖలు చేసిన వారిలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌), ఫార్మాసిటీ భూనిర్వాసితులు, నిరుద్యోగులు ఉన్నారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు ఎన్నికల కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. 11 మంది రైతులు నామినేషన్‌లు వేశారు. ట్రిపుల్‌ ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులు కూడా మూకుమ్మడిగా నామినేషన్లు వేసేందుకు వచ్చారు. కాగా, ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ మాల సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్‌లు వేశారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సమితి నుంచి 11 మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. భారీగా నామినేషన్లు దాఖలు కావడం ప్రధాన పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. ఎక్కువ మంది బరిలో ఉంటే.. వారికి ఏ గుర్తులు కేటాయిస్తారు, ఆ ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నామినేషన్ల పరిశీలన బుధవారం జరగనుంది. 24 వరకు నామినేషన్ల ఉపంసహరణకు అవకాశముంది. అభ్యర్థుల సంఖ్య 63 దాటితే బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఒక కంట్రోల్‌ యూనిట్‌ 4 బ్యాలెట్‌ యూనిట్లను సపోర్ట్‌ చేస్తుంది. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 చొప్పున 64 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. నోటా మినహాయిస్తే.. 63 మంది అభ్యర్థులకు మాత్రమే అవకాశమున్న దృష్ట్యా.. అంతకంటే ఎక్కువ మంది పోటిలో ఉంటే బ్యాలెట్‌ పోరు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Oct 22 , 2025 | 04:35 AM