Jubilee Hills By Election Schedule: వచ్చేనెల 11న ఈ నెల 13 నుంచి నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:35 AM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపడతారు...
నామినేషన్లకు 21 తుది గడువు
24 వరకు ఉపసంహరణకు గడువు
వచ్చేనెల 11న పోలింగ్.. 14న లెక్కింపు
షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల కోడ్
పారదర్శకంగా ఉప ఎన్నిక నిర్వహిస్తాం
ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. నవంబరు 11న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 21 తుది గడువు కాగా, 22న పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో సోమవారం (ఈ నెల 6) నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాను కూడా ఇటీవలే విడుదల చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వాటికి అనుగుణంగా ఎలక్ర్టానిక్ ఓటింగ్ మెషిన్లు, వీవీ ప్యాట్ యంత్రాలను ఇప్పటికే పరీక్షించి సిద్ధం చేశామన్నారు. పోలింగ్ సాఫీగా జరిగేందుకు సాంకేతిక, భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఓటరు జాబితాలో తమ పేర్లు, పోలింగ్ స్టేషన్ నంబర్, ఇతర వివరాలను పరిశీలించుకొని.. తగిన గుర్తింపు కార్డుతో ఓటు వేసేందుకు రావాలని సూచించారు. ఓటరు గుర్తింపు కార్డుతోపాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డు, పెన్షన్ పత్రం వంటి గుర్తింపు పత్రాలను చూపించి ఓటు వేయవచ్చని వివరించారు. ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు తమ క్రిమినల్ నేపథ్యం, ఇతర వివరాలను పత్రికలు, టీవీ, సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించడం తప్పనిసరి అని సీఈవో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంతోపాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 8 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ఎన్నికల కోడ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఎన్నికల కోడ్ వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో మేడ్చల్- మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు కూడా ఉన్నప్పటికీ.. ఎన్నికలు జరిగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్న దృష్ట్యా ఇక్కడ మాత్రమే కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర జిల్లాలకు వర్తించదన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి బల్దియా ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర పోలీసులతో సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామన్నారు. నియోజకవర్గంలో ప్రస్తుతం 3.98 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, మరో ఐదు రోజులపాటు (ఈ నెల 11 వరకు) ఓటు నమోదుకు అవకాశం ఉన్నందున.. ఓటర్ల సంఖ్య 4లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, సగటున ఒక్కో కేంద్రంలో 980 మంది ఓటర్లు ఉంటారని వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. కాగా, లైసెన్స్‌డ్ రివాల్వర్లు ఉన్నవారు వాటిని వెంటనే స్థానిక పోలీ్‌సస్టేషన్లలో డిపాజిట్ చేయాలని నగర సీపీ సజ్జనార్ సూచించారు. రౌడీ/హిస్టరీ షీట్స్ ఉన్న వారిని బైండోవర్ చేయనున్నట్టు తెలిపారు