Share News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ఎవరు?

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:39 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెల్లడవనున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న...

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే ఎవరు?

  • నేడే ఉప ఎన్నిక ఫలితం

  • ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం

  • తొలుత హోం ఓటింగ్‌, సర్వీస్‌ ఓట్లు

  • మధ్యాహ్నం 12 గంటలకల్లా తుది ఫలితం

  • కౌంటింగ్‌ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెల్లడవనున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్నికల్లో విజేత ఎవరన్నది మధ్యాహ్నానికల్లా తేలిపోనుంది. యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ గురువారం చెప్పారు. 4.01 లక్షల ఓటర్లున్న నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు నవీన్‌ యాదవ్‌, మాగంటి సునీతా గోపీనాథ్‌, లంకల దీపక్‌రెడ్డిలకు మద్దతుగా నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. నోటాతో కలిపి 59 గుర్తులు ఉండడంతో నాలుగు బ్యాలెట్‌ యూనిట్లు వినియోగించారు. నగర ఓటర్‌ ఎప్పటిలానే బద్దకించడంతో 48.49 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.

గంటలో తొలి రౌండ్‌ ఫలితం..

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలు కానుండగా.. తొలుత 85 ఏళ్లు దాటిన, దివ్యాంగులు వినియోగించుకున్న 101 హోం ఓటింగ్‌, సర్వీస్‌ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం షేక్‌పేట డివిజన్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోలింగ్‌ కేంద్రం సంఖ్య 1 నుంచి వరస క్రమంలో లెక్కింపు చేపడతారు. కౌంటింగ్‌ కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకులు, ప్రత్యేక బృందం ఈ ప్రక్రియను పరిశీలించనుంది. లెక్కింపు కోసం 186 మంది సిబ్బందిని నియమించినట్లు కర్ణన్‌ తెలిపారు. లెక్కింపు మొదలైన గంటలోపే తొలి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రతి 25-30 నిమిషాల్లో ఒక్కో రౌండ్‌ ఓట్ల ఫలితాలను వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లెక్కింపు నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Nov 14 , 2025 | 04:39 AM