Telangana state chief Ranchandrar Rao: మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటండి
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:44 AM
తెలంగాణలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు సూచించారు.
రాంచందర్‌రావుకు జేపీ నడ్డా దిశానిర్దేశం
న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు సూచించారు. విభేదాలను పక్కనపెట్టి పార్టీ నేతలు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. మంగళవారం సాయంత్రం నడ్డా కార్యాలయానికి వెళ్లిన రాంచందర్‌రావు.. దాదాపు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని నడ్డాకు రాంచందర్‌రావు తెలిపారు. పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల్లో దాదాపు 800 మంది సర్పంచ్‌లుగా, వేలాది మంది వార్డు సభ్యులుగా గెలిచారని చెప్పారు. తెలంగాణకు రావాలని నడ్డాను ఆహ్వానించారు. పార్టీని మరింత పటిష్ఠం చేయడంతో పాటు సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాంచందర్‌రావుకు నడ్డా దిశానిర్దేశం చేశారు.