Share News

ఉల్లాసం..ఉత్సాహం

ABN , Publish Date - May 09 , 2025 | 11:54 PM

విద్యార్థులకు వేసవి సెలవులు ఎంతో సంతోషానిస్తున్నాయి. చిన్నారులు ఒక్కొక్కరు వేసవి తా పాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి ప్రత్యామ్నాయంగా భానుడి తీవ్రత ను తట్టుకునేందుకు ఈతను నేర్చుకుంటున్నారు.

  ఉల్లాసం..ఉత్సాహం
ఇండోర్‌ స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతున్న బాలబాలికలు

ఉల్లాసం..ఉత్సాహం

ఈతపై చిన్నారుల ఆసక్తి

ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు

వేసవి సెలవులు సద్వినియోగం

నల్లగొండ స్పోర్ట్స్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు వేసవి సెలవులు ఎంతో సంతోషానిస్తున్నాయి. చిన్నారులు ఒక్కొక్కరు వేసవి తా పాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి ప్రత్యామ్నాయంగా భానుడి తీవ్రత ను తట్టుకునేందుకు ఈతను నేర్చుకుంటున్నారు. సరదాగా సెలవులు వినియోగించుకొని నూతన ఉత్సహాన్ని పొందుతున్నారు. పాఠశాల తరగతులకు బైబై చెప్పిన పిల్లలు, ఈత నేర్చుకునేందుకు సైసై అంటున్నారు. ఈత వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అంతేకాక మనోధైర్యం కూడా పెరుగుతుంది. దీంతో పిల్లలకు ఈత నేర్పేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. ఈత ప్రాధాన్యతను తెలిసిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ తకొలను ప్రవేశం ఇప్పించి దగ్గరుండి మరి ఈత నేర్పిస్తున్నారు. పిల్లలు ఈత నేర్చుకోవడంతో పాటు వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండలోని ఇండోర్‌ స్టేడియంలో వేసవి సెలవుల్లో ఈతకొలనును ప్రారంభించారు.

నిబంధనలు పాటించాలి

స్విమ్మింగ్‌ పూల్‌లో అడ్మిషన పొందిన వారు నిబంధనలను పాటించాలి. వారికి కేటాయించిన సమయంలోనే సిమ్మింగ్‌ పూల్‌కు రావాలి. ప్రతీరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మూడు బ్యాచలు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మూడు బ్యాచలు నడుస్తున్నాయి. బ్యాచలో 70 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈతకు వచ్చే వారందరూ శుచి శుభ్రతను పాటించాలి.

ఈత శారీరక ఆరోగ్యానికి దోహదం

ప్రతి విద్యార్థికి చదువుతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం. విద్యా సంవత్సరంలో రోజు పాఠశాలకు పుస్తకాలు మోస్తూ ఎంతో ఒత్తిడికి లోనవుతాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆటపాటలకు విరామం లేకుండా పోయింది. కొన్ని పాఠశాలల్లో క్రీడా స్థలాలు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. వేసవి సెలవులు రావడం ఎంతో ఊరట ఇస్తుంది. ఈ మేరకు ఈతకొలనులో శిక్షణ పొందుతున్నాను. మండే ఎండలను ఈత ఉపశమనం ఇస్తుంది.

- ఏ. సాయి కృష్ణ

ఉత్సాహంగా ఉంది

వేసవి తాపాన్ని తాళలేక మా తల్లిదండ్రులు ఈత శిక్షణకు పంపిస్తున్నారు. అక్కడే నూతన స్నేహితులు కూడా పరిచయమయ్యారు. వేసవి తాపానికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా ఈత కొడుతుతున్నాను. దీంతో ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంది. తక్కువ సమయంలోనే ఈత నేర్చుకుంటున్న అందుకు ఆనందంగా ఉంది.

- కె. గోదారెడ్డి, నల్లగొండ

ప్రమాదాల నుంచి రక్షణ

ఆపద సమయాల్లో నీళ్ల ప్రమాదాల నుంచి గట్టెక్కేందుకు వేసవి సెలవుల్లో ఈత నేర్చుకుంటున్నాను. ప్రతీరోజు ఈతకొలను వచ్చి శిక్షకుని సలహాలు, సూచనలతో స్విమ్మింగ్‌ చేస్తున్నాను. ఈతకొలనుకు ఎంతోమంది చిన్నారులు, పెద్దలు వస్తున్నారు. వారితో పాటు నేను ఈత కొట్టడం ఆనందంగా ఉంది.ప్రతిఒక్కరూ ఈత నేర్చుకోవడం మంచింది.

- ఆఫ్‌నాన అహ్మద్‌, నల్లగొండ

ఆరోగ్యానికి చేయూత

వేసవి సెలవుల్లో రోజు సాయంత్రం ఈత కొట్టడానికి ఇండోర్‌ స్టేడియంలో ఉన్న ఈత కొలనుకు వస్తున్నాను. నాతో పాటు ఎంతోమంది అమ్మాయిలు ఈత నేర్చుకుంటున్నారు. అమ్మాయిలు ఈత నేర్చుకోవడం ఎంతో అవసరం. మా తల్లిదండ్రులు నేను ఈత నేర్చుకునేలా ఎంతో ప్రోత్సహిస్తున్నారు.

- ఏ.సాన్వి, 6వ తరగతి, నల్లగొండ

ఈతకొలను శుభ్రంగా ఉంచుకోవాలి

వేసవి సెలవుల్లో ఇండోర్‌ స్టేడియంలోని ఈతకొలను పున:ప్రారంభించాం. రెండు నెలల పాటు ఈ కొలను నడుస్తుంది. ఇప్పటికే చాలామంది అడ్మిషన్లు పొందారు. అడ్మిషన్లు పొందిన వారు స్విమ్మింగ్‌ పూల్స్‌ నియమ, నిబంధనలు తప్పక పాటించాలి. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బ్యాచల వారీగా ఈత కొట్టేందుకు అనుమతిస్తున్నాం. స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగేముందు స్నానం చేసి, స్విమ్మింగ్‌ డ్రెస్సులు తప్పనిసరిగా ధరించాలి. స్విమ్మింగ్‌ పూర్తయిన తర్వాత కూడా చర్మవ్యాధులు రాకుండా మళ్లీ స్నానం చేయాలి. బాల, బాలికలకు ఈత కొట్టేందుకు ప్రత్యేకంగా కోచలను నియమించాం. కోచల సూచనలు, సలహాలతోనే ఈత కొట్టాలి. ఈత కొలను శుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలి.

- కుంభం నర్సిరెడ్డి, డీవైఎ్‌సవో అధికారి

Updated Date - May 09 , 2025 | 11:54 PM