Health Minister Damodar Rajanarasimha: జర్నలిస్టులు, ఉద్యోగులకు సూపర్‌స్పెషాలిటీ వైద్యసేవలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:59 AM
ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (ఈజేహెచ్‌ఎ్‌స) ద్వారా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతోపాటు జర్నలిస్టులకు మెరుగైన ..
వెల్‌నెస్ సెంటర్లలో వైద్య సేవల విస్తరణ
అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎంప్లాయీస్ అండ్ జర్నలిస్ట్స్ హెల్త్ స్కీం (ఈజేహెచ్‌ఎ్‌స) ద్వారా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతోపాటు జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో ఈజేహెచ్‌ఎ్‌సపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ స్కీం కింద వైద్య సేవల విస్తరణలో భాగంగా ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతను నిమ్స్, రాష్ట్రంలోని మిగతా వెల్‌నెస్ సెంటర్ల బాధ్యతలను రాష్ట్ర వైద్య విద్యా విభాగానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇకపై వెల్‌నెస్ సెంటర్లలో జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలనూ దశలవారీగా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా స్పెషాలిటీల డాక్టర్లను, సిబ్బందిని వెల్‌నెస్ సెంటర్లలో నియమించడంతోపాటు రోగులకు అవసరమైన పరీక్షలు చేసేందుకు అవసరమైన పరికరాలనూ ఏర్పాటు చేయాలన్నారు.