Share News

Mulugu: ఆంధ్రజ్యోతి విలేకరిపై హత్యాయత్నం

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:31 AM

ఆంధ్రజ్యోతి’ ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి చల్లకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు హత్యాయత్నం చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని వార్తలు రాస్తావా.. ఎంత ధైర్యం నీకు ?

Mulugu: ఆంధ్రజ్యోతి విలేకరిపై హత్యాయత్నం

  • ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి

  • శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ నేతల దాడి

  • మాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తావా? అంటూ

  • కారులోకి లాగి పిడిగుద్దులు, కత్తితో పొడిచే యత్నం

  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ రెడ్డి

ములుగు, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ములుగు జిల్లా తాడ్వాయి మండల విలేకరి చల్లకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కొందరు కాంగ్రెస్‌ నాయకులు హత్యాయత్నం చేశారు. ‘ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని వార్తలు రాస్తావా.. ఎంత ధైర్యం నీకు ?’ అంటూ తమ కారులోకి లాగి దుర్భాషలాడుతూ పిడిగుద్దులు కురిపించారు. ఆపై కత్తి తో పొడిచేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న శ్రీకాంత్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ములుగు జిల్లా నార్లాపూర్‌కు చెందిన శ్రీకాంత్‌ రెడ్డి వార్తల సేకరణ నిమిత్తం మంగళవారం తాడ్వాయికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వస్తూ.. కొమురం సారమ్మ గుడి దాటిన తర్వాత ఓ చోట ఆగి ఫోన్‌ మాట్లాడుతున్నాడు. కారులో అక్కడికి వచ్చిన ములుగు జిల్లా కాంగ్రెస్‌ కార్యదర్శి తాండాల శ్రీనివాస్‌, నార్లాపూర్‌ గ్రామ కమిటీ అధ్యక్షుడు మొక్క శ్రీనివాస్‌, ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీ సభ్యులు బొప్ప వినోద్‌, ఎనగంటి సాయికృష్ణ, పార్టీ కార్యకర్త శంకె శ్రావణ్‌ దాడికి దిగారు. శ్రీకాంత్‌రెడ్డిని తమ కారులోకి లాగి పిడిగుద్దులు కురిపిస్తూ.. కాళ్లతో తన్ని కత్తితో పొడిచేందుకు యత్నించారు. గట్టిగా అరుస్తూ వారిని వదిలించుకుని బయటికొచ్చిన శ్రీకాంత్‌రెడ్డి రోడ్డుపైకి పరుగెత్తగా.. అటుగా వచ్చేవారిని చూసి కాంగ్రెస్‌ నేతలు పరారయ్యారు. ఈ దాడిలో గాయపడిన శ్రీకాంత్‌రెడ్డి ఏటూరునాగారం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. శ్రీకాంత్‌రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టులు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 04:32 AM