Minister Ponguleti Srinivas Reddy: ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రె్‌సతోనే సాధ్యం
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:02 AM
ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు...
ఉద్యోగాల పేరిట టీజీపీఎస్సీని నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇవ్వాలన్నా, పేదలకు అండగా ఉండాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాలతోనే సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల గ్రూప్-1లో జిల్లా రిజిస్ట్రార్‌లుగా ఎంపికైన వారు మంత్రిని మంగళవారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గ్రూప్-1 పోస్టులు భర్తీ చేసి ప్రజాప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. గత పాలకులు ఉద్యోగ నియామకాలు చేయాల్సిన టీజీపీఎస్సీని నిర్వీర్యం చేశారని, ఈ దశలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆదాయ వనరుగా చూసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మెరుగైన సేవలను అందించే దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. కొత్తగా విధుల్లో చేరబోయే జిల్లా రిజిస్ట్రార్లు ప్రభుత్వ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిజాయితీగా పని చేయాలని సూచించారు.