Share News

JNTU: సెట్‌ కమిటీల కూర్పుపై ఆచార్యుల అసంతృప్తి

ABN , Publish Date - Dec 31 , 2025 | 05:18 AM

కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌)ల నిర్వహణ కమిటీల కూర్పుపై జేఎన్‌టీయూ ఆచార్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

JNTU: సెట్‌ కమిటీల కూర్పుపై ఆచార్యుల అసంతృప్తి

  • ఒకే విభాగం నుంచి ఎప్‌సెట్‌ కన్వీనర్‌, కో-కన్వీనర్‌

  • పీజీఈసెట్‌ కన్వీనర్‌, కో-కన్వీనర్ల నియామకంలోనూ అంతే..

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సెట్‌)ల నిర్వహణ కమిటీల కూర్పుపై జేఎన్‌టీయూ ఆచార్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది నిర్వహించే ఎప్‌సెట్‌, పీజీఈసెట్‌ బాధ్యతలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సోమవారం జేఎన్‌టీయూకు అప్పగించగా.. ఈ సెట్‌ల నిర్వహణకు జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు మంగళవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. ఎప్‌సెట్‌ కమిటీ కన్వీనర్‌, కో కన్వీనర్‌ పోస్టుల్లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికే చెందిన ఇద్దరు సీనియర్‌ ప్రొఫెసర్లను, పీజీఈసెట్‌ కమిటీ కన్వీనర్‌, కో కన్వీనర్‌ పోస్టుల్లోనూ ఫిజిక్స్‌ విభాగం నుంచే ఇద్దరు ప్రొఫెసర్లను నియమించడం వివాదాస్పదంగా మారింది. ఇక నాలుగు పోస్టుల్లో మహిళా ఆచార్యుల్లో ఒక్కరినీ తీసుకోకపోవడాన్ని ఆచార్యుల సంఘం తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఆయా సెట్లలో గతంలో పనిచేసిన వారికే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, ఔత్సాహిక ప్రొఫెసర్లకు అవకాశమివ్వకపోవడం పట్ల సంఘం ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మెకానికల్‌, ఫిజిక్స్‌ విభాగాల ఆచార్యులకే కాకుండా ఇతర విభాగాల్లో సమర్థులైన ఆచార్యులను సెట్‌ నిర్వహణ కమిటీల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి సెట్‌ కమిటీలోనూ మహిళా ఆచార్యులకు ప్రాధాన్యం దక్కేలా చర్యలు తీసుకోవాలని వైస్‌చాన్స్‌లర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Dec 31 , 2025 | 05:18 AM