Share News

JNTU Introduces Processing Fee for Grace Marks: ఇకపై ఫీజు కడితేనే గ్రేస్‌ మార్కులు!

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:18 AM

జేఎన్‌టీయూ పరీక్షల విభాగంలో కొత్త రకం దోపిడీకి రంగం సిద్ధమైందా అంటే.. అవుననే అంటున్నాయి విద్యార్థి సంఘాలు.. విద్యార్థులకు ఉచితంగా అందే సేవలకు ప్రాసెసింగ్‌ ఫీజుల....

JNTU Introduces Processing Fee for Grace Marks: ఇకపై ఫీజు కడితేనే గ్రేస్‌ మార్కులు!

  • జేఎన్‌టీయూలో కొత్త రకం దోపిడీ

  • విద్యార్థులపై ఏటా రూ.4 కోట్ల భారం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ పరీక్షల విభాగంలో కొత్త రకం దోపిడీకి రంగం సిద్ధమైందా అంటే.. అవుననే అంటున్నాయి విద్యార్థి సంఘాలు.. విద్యార్థులకు ఉచితంగా అందే సేవలకు ప్రాసెసింగ్‌ ఫీజుల పేరిట గతంలో ఎన్నడూ లేని విధంగా పెనుభారం మోపుతున్న వర్సిటీ ఉన్నతాధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. తాజాగా డబ్బులిస్తేనే గ్రేస్‌ మార్కులు వేస్తామంటూ జేఎన్‌టీయూ పరీక్షల విభాగం సర్క్యులర్‌ జారీ చేసింది. యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి రుసుము లేకుండానే.. అర్హులైన విద్యార్థుల వినతి మేరకు గ్రేస్‌ మార్కులను కలిపి డిగ్రీలు జారీ చేసేవారు. అయితే, ఇకపై రూ.2 వేలు ఫీజు చెల్లిస్తేనే గ్రేస్‌ మార్కుల కోసం వచ్చిన విద్యార్థి దరఖాస్తును ప్రాసెస్‌ చేస్తామని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. డిసెంబరు 1 నుంచి గ్రేస్‌ మార్కులు కావాలన్నా, సబ్జెక్టుల మినహాయింపు కావాలన్నా ఒక్కో విద్యార్థి రూ.2 వేలు చొప్పున చెల్లించాల్సిందేనని వర్సిటీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏటా సుమారు 20 వేల మంది బీటెక్‌, బీఫార్మసీ, మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సులు చదివిన విద్యార్థులు గ్రేస్‌ మార్కులు, సబ్జెక్టుల మినహాయింపునకు దరఖాస్తు చేసుకుంటారు. ఆయా సేవలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.2 వేలు ఫీజును వసూలు చేయాలని జేఎన్‌టీయూ నిర్ణయించడంతో వారిపై ఏటా రూ.4 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇప్పటికే కామన్‌ సర్వీసు ఫీజు పేరిట రూ.వేలకు వేలు వసూలు చేస్తున్న జేఎన్‌టీయూ అధికారులు, సబ్జెక్టుల మినహాయింపు, ఉదారంగా ఇచ్చే గ్రేస్‌ మార్కులకు డబ్బు చెల్లించాలనడం దుర్మార్గమని స్టూడెంట్‌ ప్రొటెక్షన్‌ ఫోరం కన్వీనర్‌ జవ్వాజి దిలీప్‌ మండిపడ్డారు. కొత్తగా తెచ్చిన ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

పని పెరగడంతో ఫీజులు తప్పలేదు..

గ్రేస్‌మార్కులు, సబ్జెక్టుల మినహాయింపు సేవలకోసం రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని.. పరీక్షల విభాగంలో పని పెరిగిందని జేఎన్‌టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణమోహనరావు అన్నారు. దీంతో ఆ మేర ఉద్యోగులను పెంచి వారికి వేతనాలు చెల్లిస్తుండటంతోనే కొత్త ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 04:18 AM