Share News

kumaram bheem asifabad- జీవో 49ని ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:39 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుమరం భీం జిల్లాను టైగర్‌ కన్జర్వుగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్‌ చేశారు. కాగజ్‌నగరలో ఆదివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు జీవో ప్రతులను దహనం చేశారు

kumaram bheem asifabad- జీవో 49ని ఉపసంహరించుకోవాలి
జీవో 49 ప్రతులను దహనం చేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌బాబు

కాగజ్‌నగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుమరం భీం జిల్లాను టైగర్‌ కన్జర్వుగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీవో 49ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్‌ చేశారు. కాగజ్‌నగరలో ఆదివారం ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. జీవో49 విడుదల కోసం ఈ ప్రాంత అటవీ శాఖ అధికారులు వివిధ గ్రామాల్లో గ్రామసభలు పెట్టినట్టు ఉన్నతాధికారులకు నివేదికలివ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యేగా ఉన్న తనకే ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా ఇలాంటివి మానుకోవాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు లేకున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని అన్నారు. జీవో49 అమలు జరిగితే ఈ ప్రాంతం పూర్తిగా కుంటుపడి పోతుందన్నారు. పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ రోడ్లు కనీసం మరమ్మతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. తాగునీటి ఇబ్బందులు ఉన్న చోట్ల కనీసం బోరింగ్‌ కూడా వేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను విరమించుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. అన్ని సంఘాల మద్దతుతో మరింత ఉధృతంగా చేస్తామని చెప్పారు. పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో పులిని చంపిన కేసులో బడా వ్యక్తిని అటవీ శాఖ అధికారులు వదిలేసి చిన్నవారిపై కేసులు నమోదు చేశారని అన్నారు. గతంలో ఉన్న ఇన్‌చార్జి మంత్రి సీతక్క గిరిజనుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. జీవో49ని వెంటనే రద్దు చేసేలా చూడాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షుడు శివ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్‌, మండల అధ్యక్షుడు పుల్ల అశోక్‌, మాజీ ఎంపీటీసీ గణపతి, నాయకులు తిరుపతి, గజ్జల లక్ష్మణ్‌, తిరుపతిగౌడ్‌, మహేష్‌, చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 10:39 PM