Share News

జీవో 46 బీసీలకు గుదిబండ

ABN , Publish Date - Nov 25 , 2025 | 12:06 AM

స్థానిక సంస్థలకోసం తెచ్చిన జీవో నెం.46 బీసీ వర్గాల మెడకు గుదిబండగా మారిందని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ జాజుల లింగం గౌడ్‌అన్నారు.

జీవో 46 బీసీలకు గుదిబండ
కొండమల్లేపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న బీసీ సంఘం నాయకులు

మిర్యాలగూడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకోసం తెచ్చిన జీవో నెం.46 బీసీ వర్గాల మెడకు గుదిబండగా మారిందని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ జాజుల లింగం గౌడ్‌అన్నారు. సోమవారం మిర్యాలగూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలోని 869 గ్రామపంచాయతీల్లో 2019లో బీసీలకు 164 రిజర్వ్‌ అయ్యాయన్నారు. ప్రస్తుతం బీసీలకు 140 మాత్రమే రిజర్వు అయ్యాయన్నారు. గతంలోకంటే 24 స్థానాలను తగ్గించడం బాధాకరమన్నారు. రిజర్వేషన్ల అమలులులో రొటేషన్‌ విధానంతో బీసీలు చాలా నష్టపోయారన్నారు. ఎన్నో ఏళ్లుగా దామాషా పద్ధతిన అన్నిరంగాల్లో బీసీలకు వాటాకోసం ప్రజలు పోరాడుతున్నా రాజకీయ పార్టీల్లో చలనం లేదన్నారు. బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం తక్కువైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 42శాతం రిజర్వేషన్లను అమలు కానీయకుండా కుట్రలకు పాల్పడ్డారని అన్నారు. ఓట్లకోసం బీసీల పాటపాడుతున్న వివిధ పార్టీల నేతలు తెర వెనుక రాజకీయం చేస్తూ బీలకు ద్రోహం చేస్తున్నారని చెప్పారు. బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీ నాయకులు దీనికి బాధ్యత వహించాలన్నారు. స్థానిక సంస్థలకోసం రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.46 బీసీల రిజర్వేషన్లకు ఎసరు పెట్టిందన్నారు. బీసీలు ఎమ్మెల్యేలు కాదుకదా సర్పంచ్‌, వార్డు సభ్యులుగా కూడా గెలవకుండా నిలువరించేందుకే అగ్రకుల పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

కొండమల్లేపల్లి: బీసీ రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న జీవో నెం.46ను రద్దు చేసి బీసీలకు న్యాయబద్ధంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌ కల్పిస్తామని ఆర్డినెన్స్‌, జీవో చట్టసభల్లో బిల్లు ఆమోదం చేసి కేంద్రంపై ఒత్తిడి తేకుండా అభివృద్ధి నిధుల పేరుతో జీవో నెం.46ను తీసుకొచ్చి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని తెలుపుతూ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. అంతకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఏ. కైసర్‌ఖాన్‌, కోట్ల జగదీష్‌, బొడిగ శంకర్‌గౌడ్‌, ఏరుకొండ రాము, భూతరాజు భరత్‌, చిలువేరు శ్రీధర్‌, గిరి, వెంకట్‌, రజనీకాంత్‌, మల్లేష్‌, యాదయ్య, నూతనగంటి జగన్‌, తోటపల్లి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 12:06 AM