Cotton Purchases: వారంలోగా పత్తి కొనుగోళ్లు షురూ!
ABN , Publish Date - Oct 07 , 2025 | 02:47 AM
పత్తి కొనుగోళ్లకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు....
తెల్ల బంగారం కొనుగోళ్లకు తొలగిన అడ్డంకులు.. జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐతో తుమ్మల చర్చలు సఫలం
జాబ్‌వర్క్ టెండర్లలో పాల్గొనాలని మిల్లర్ల నిర్ణయం
హైదరాబాద్, వరంగల్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లకు సంబంధించి అడ్డంకులు తొలగిపోయాయి. జిన్నింగ్ మిల్లర్లు, సీసీఐ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిలిచిన జాబ్‌వర్క్ టెండర్లలో పాల్గొనబోమని కొద్దిరోజులుగా మొండికేస్తున్న జిన్నింగ్ మిల్లర్లు... సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమావేశంతో దారికొచ్చారు. జాబ్‌వర్క్ టెండర్లలో పాల్గొనాలని అసోసియేషన్ ప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. సీసీఐ విడుదల చేసిన టెండరు నోటిఫికేషన్‌లో లింట్ శాతం ఎల్-1, ఎల్-2 కేటాయింపులు, స్లాట్ బుకింగ్, ఏరియా మ్యాపింగ్ కోసం విధించిన నిబంధనలపై చర్చలు జరిపారు. దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిబంధనలు అమలుచేస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని జిన్నింగ్ మిల్లర్లు టెండర్లలో పాల్గొంటుండగా అదే పద్ధతిలో మన రాష్ట్రంలోని జిన్నింగ్ మిల్లర్లు కూడా నడుచుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో ఏవైనా సమస్యలు ఏర్పడితే, ప్రతివారం సమీక్ష నిర్వహించుకొని జిన్నింగ్ మిల్లర్లు, పత్తి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీసీఐ అధికారులకు సూచించారు. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తుమ్మల సూచించగా, జిన్నింగ్ మిల్లర్లు అంగీకరించారు.
రైతులకు అవగాహన కల్పించాలి: తుమ్మల
వారంలోగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలోపు రైతులకు పత్తి అమ్మకాలపై అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. మొబైల్ యాప్ డౌన్‌లోడ్, స్లాట్ బుకింగ్‌పై ఇప్పటికే రైతు వేదికల్లో వివరిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ అధికారులు సమన్వయం చేసుకొని రైతులను జాగృతం చేయాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబరును కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ బి. గోపి, సీసీఐ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్, కేంద్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ పూర్ణేశ్ గురునాని, సీసీఐ బ్రాంచి మేనేజర్లు, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, జిన్నింగ్ మిల్లుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
‘
కపా్‌స’పై అవగాహన ఉందా?
కపాస్ కిసాన్ యాప్! పత్తి కొనుగోళ్లలో అక్రమాలను నివారించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ మొబైల్ యాప్‌పై రైతులకు ఎంత మేర అవగాహన ఉంది? ఈ యాప్‌తో కొనుగోళ్లు సాఫీగా జరగడం మాట దేవుడెరుగు.. రైతులకు కొత్త ఇబ్బందులు తలెత్తవు కదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పంటను విక్రయించుకోవాలనుకునే పత్తి రైతులు, తమ ఫోన్లలో కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబరుతో పేరు, ఊరు, భూమి సర్వే నంబరు, సాగు విస్తీర్ణం తదితర వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అనంతరం పత్తి విక్రయం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత.. ఏ రోజు, ఏ సమయానికి, ఏ కేంద్రానికి పత్తిని తీసుకురావాలనేది ఆ యాప్ ద్వారానే రైతులకు సందేశం వస్తుంది. స్లాట్‌లో సూచించిన రోజు రైతు వెళితేనే సరుకు కొనుగోలు చేస్తారు. అయితే.. రైతుల్లో నిరక్షరాస్యులూ ఉంటారని.. వారికి ఈ ప్రక్రియపై అవగాహన ఉంటుందా? కేంద్రం ప్రవేశపెట్టిన ఈ యాప్ విధానం ఏ మేరకు సక్సెస్ అవుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పైగా చాలామంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవని.. ఈ కారణంగా రైతులు ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.