Jetty Kusum Kumar: ఏఐసీసీ కార్యదర్శిగా కుసుమ్ కుమార్
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:44 AM
టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్‌కుమార్.. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒడిసా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి అనుబంధంగా పార్టీ వ్యవహారాలు...
ఒడిసాలో పార్టీ సహ ఇన్‌చార్జిగా నియామకం
రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గ నేతకు కీలక పదవి.. మొత్తం 8 మందికి ఏఐసీసీ కార్యదర్శులుగా చాన్స్
తెలంగాణకు మరో ఇన్‌చార్జిగా సచిన్ సావంత్.. కుసుమ్‌కు అభినందనలు తెలిపిన టీపీసీసీ చీఫ్
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్‌కుమార్.. ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఒడిసా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి అనుబంధంగా పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతలను అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఓ ప్రకటనలో వెల్లడించారు. దశాబ్దాలుగా కమ్మ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శిగా ఎవరూ ఎంపిక కాలేదని, కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యతను గుర్తించిన అధిష్ఠానం.. కుసుమ్ కుమార్‌కు కీలక పదవి అప్పజెప్పిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, కుసుమ్‌కుమార్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 8 మందిని ఏఐసీసీ కార్యదర్శులుగా ఖర్గే నియమించారు. వీరిలో సచిన్ సావంత్‌కు.. మీనాక్షీ నటరాజన్‌తో కలిసి తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతలను అప్పగించారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన కుసుమ్‌కుమార్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషికి ఫలితం దక్కిందన్నారు. తెలంగాణకు మరో ఇన్‌చార్జిగా నియమితులైన సచిన్ సావంత్‌కు స్వాగతం చెప్పారు.
విద్యార్థి దశ నుంచీ కాంగ్రె్‌సలోనే!
ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులైన జెట్టి కుసుమ్‌కుమార్.. ఎన్‌ఎ్‌సయూఐ కార్యకర్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2003లో ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కుసుమ్.. తెలంగాణ ఏర్పడ్డాక టీపీసీసీలోనూ అదే హోదోలో కొనసాగారు. 2018లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడిగా పేరున్న కుసుమ్.. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు.