Nursing Education: నర్సింగ్‌లో జపనీస్, జర్మన్ భాషల బోధన
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:27 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.....
43 కాలేజీల్లో మొదలైన తరగతులు
1700 మంది నర్సింగ్ విద్యార్థుల ఆసక్తి
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నర్సింగ్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉన్న జపాన్, జర్మనీ దేశాల భాషల బోధనను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 37 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు, 6 నర్సింగ్ స్కూల్స్ సహా మొత్తం 43 విద్యా సంస్థల్లో బుధవారం నాడు వర్చువల్ పద్ధతిలో ఈ తరగతులు లాంఛనంగా మొదలయ్యాయి. ప్రభుత్వ నర్సింగ్ సంస్థల్లో విదేశీ భాషలను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి అని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ భాషల బోధన కోసం వైద్య ఆరోగ్య శాఖ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఎఫ్లూ)తో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 1,863 మంది నర్సింగ్ విద్యార్థులకు ఈ శిక్షణ అందించాల్సి ఉండగా, ఇప్పటికే 1,700 మంది విద్యార్థులు జపనీస్, జర్మన్ భాషలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. ఈ కోర్సు వ్యవధి 16 నెలలు కాగా, ప్రతి సెమిస్టర్ 4 నెలల పాటు ఉంటుంది. ప్రస్తుతం జపాన్‌లో భారతీయ నర్సులకు సగటున నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వేతనం లభిస్తోంది. అదే జర్మనీలో అయితే ఏకంగా నెలకు రూ.2-3 లక్షల వరకు ఉంటుంది.