Share News

Jaggareddy Urges Jubilee Hills Voters: రాబోయే మూడేళ్లూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటది

ABN , Publish Date - Nov 09 , 2025 | 01:25 AM

రానున్న మూడేళ్లూ ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటాడని.. జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఆలోచన చేసి.. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని...

Jaggareddy Urges Jubilee Hills Voters: రాబోయే మూడేళ్లూ కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉంటది

  • సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటడు.. నవీన్‌ యాదవ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి

  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి

  • జూబ్లీహిల్స్‌ ఓటర్లకు జగ్గారెడ్డి విజ్ఞప్తి

  • ఈ బస్తీలోనే పుట్టి పెరిగిన వ్యక్తి..ఉరికే గుర్రంలాంటి వ్యక్తి నవీన్‌ యాదవ్‌

  • నవీన్‌ను గెలిపిస్తే ఇంటోడు అవుతాడు

  • సీఎం రేవంత్‌ ఇంటికి వెళ్లి పనులు చేయించుకువస్తడు

  • ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే పాలోడవుతాడు

  • ధర్నాలు, రాస్తారోకోలకే పరిమితమవుతారు

  • ‘జూబ్లీహిల్స్‌’ ఓటర్లారా ఆలోచన చేయండి

  • కాంగ్రె్‌సపై దుష్ప్రచారాలను నమ్మకండి

  • రాజకీయ ఉనికి, కేసీఆర్‌ వారసత్వం కోసంకేటీఆర్‌ ఈ ఉప ఎన్నికను వాడుకుంటున్నడు

  • జూబ్లీహిల్స్‌ ప్రజలు కేటీఆర్‌ మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి

హైదరాబాద్‌, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రానున్న మూడేళ్లూ ఉండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, సీఎంగా రేవంత్‌రెడ్డే ఉంటాడని.. జూబ్లీహిల్స్‌ ఓటర్లు ఆలోచన చేసి.. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ బస్తీల్లోనే పుట్టి పెరిగిన నవీన్‌యాదవ్‌ను గెలిస్తే సీఎం రేవంత్‌ ఇంటికి వెళ్లి మరీ పనులు చేయించుకువస్తారన్నారు. అదే ప్రతిపక్షాల అభ్యర్థి గెలిస్తే.. వచ్చే మూడేళ్లూ ధర్నాలు, రాస్తారోకోలకు పరిమితమవుతారని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నవీన్‌ యాదవ్‌ను గెలిపిస్తే ఇంటి మనిషిని గెలిపించినట్లవుతుందని, ప్రతిపక్ష అభ్యర్థిని గెలిపిస్తే పాలోడిని గెలిపించినట్లేనన్నారు. ఇంటి మనిషిని అయితే బెడ్‌ రూమ్‌లో ఉన్నా వెళ్లి అడిగి పనులు చేయించుకోవచ్చునని, పాలోడికి ఓటేస్తే ఇంటి బయటే ఉండి అడగాల్సి వస్తుందని చెప్పారు. నవీన్‌ యాదవ్‌ తనకు చిన్నతనం నుంచీ తెలుసని, రేసుగుర్రంలా పరిగెత్తే యువకుడు, సామాజిక స్పృహ ఉన్న నాయకుడన్నారు. పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తున్నాడని కితాబునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కన్నా నవీన్‌ యాదవ్‌ వంద రెట్లు మెరుగైన వాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటను గౌరవించి కాంగ్రె్‌సను గెలిపిస్తే.. ఆయన మరింత ఉత్సాహంతో పనిచేస్తారని, మంత్రులూ జవాబుదారీగా పనిచేస్తారని పేర్కొన్నారు. కొల్లూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌లలో నివసించే వాళ్లకు రేషన్‌ షాప్‌లు లేవని, సీఎం రేవంత్‌రెడ్డి చెప్పగానే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కొక్క హామీ అమలు చేస్తూ వస్తున్నారని, ఓపిక పడితే అన్నీ అమలవుతాయన్నారు. కేటీఆర్‌.. బక్వాస్‌ మాటలు నమ్మవద్దని, ఆయన తన రాజకీయ ఉనికి కోసం, కేసీఆర్‌ వారసత్వం పొందేందుకూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను వాడుకుంటున్నాడని, కాంగ్రె్‌సపై, ప్రభుత్వంపైన దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా, కాంగ్రె్‌సపైన సోషల్‌ మీడియాలో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. జూబ్లీహిల్స్‌లో హైడ్రా.. ఎక్కడైనా ఇళ్లు కూలగొట్టిందా అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - Nov 09 , 2025 | 01:25 AM