Share News

TPCC working president Jaggareddy: చరిత్ర చెరిపేయమని అధికారం ఇచ్చారా?

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:54 AM

మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాహుల్‌ గాంధీ కుటుంబాల చరిత్ర లేకుండా చేయాలని చెప్పి ప్రజలు మోదీకి అధికారం ఇచ్చారా..

TPCC working president Jaggareddy: చరిత్ర చెరిపేయమని అధికారం ఇచ్చారా?

  • గాంధీ, నెహ్రూ, రాహుల్‌ కుటుంబాల చరిత్ర లేకుండా చేయడానికి మోదీ కుట్ర

  • 1930లోనే గాంధీ సత్యాగ్రహం

  • నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారు

  • ఇందిర సైతం ప్రజల కోసం జైలుకు వెళ్లారు

  • ఈ మోదీ, షాలు అప్పుడు పుట్టనేలేదు

  • ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరుతో సోనియా గాంధీ తెచ్చారు

  • బీజేపీ నేతలు... ఆ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగిస్తున్నారు

  • గాంధీ, నెహ్రూ, రాహుల్‌ కుటుంబాలచరిత్రను ప్రజలకు చెప్పేందుకు లక్ష మందితో సంగారెడ్డిలో సభ పెడతా

  • టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ‘‘మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాహుల్‌ గాంధీ కుటుంబాల చరిత్ర లేకుండా చేయాలని చెప్పి ప్రజలు మోదీకి అధికారం ఇచ్చారా.. లేక దేశ ప్రజలకు సుపరిపాలనను అందించాలని చెప్పి ఇచ్చారా?’’ అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. దీనికి ఢిల్లీ బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొన్నటి దాకా నెహ్రూను, ఇప్పుడు గాంధీజీని టార్గెట్‌ చేసి.. దేశ చరిత్రలో వారిని లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. పార్లమెంటులో ప్రజల అవసరాలు, రైతులు. మహిళల సమస్యలు, యువతకు ఉద్యోగాలపై చర్చించే పరిస్థితే లేదన్నారు. దేశం కోసం, దేశానికి స్వాతంత్రం కోసం ఆస్తిని, ప్రాణాలను త్యాగం చేసిన నెహ్రూ కుటుంబాన్ని వందేమాతరంపై చర్చ సందర్భంగా బీజేపీ టార్గెట్‌ చేసిందని, అయితే దానికి ప్రియాంకాగాంధీ దీటుగానే సమాధానం ఇచ్చారని చెప్పారు. దేశం కోసం గాంధీ, నెహ్రూలు పోరాడిన కాలంలో మోదీ, అమిత్‌ షా పుట్టనే లేదని, కానీ ఇప్పుడు వారు గాంధీ, నెహ్రూలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశం కోసం నెహ్రూ 12 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారని, ఇందిర సైతం ఆరేళ్లు జైల్లో ఉన్నారని, గాంధీజీ 1930లోనే ఉప్పు సత్యాగ్రహం చేశారని గుర్తు చేశారు. వారికి బీజేపీ నాయకుల్లా నేర చరిత్ర లేదన్నారు. మోదీ ఇంత స్వేచ్ఛగా మూడుసార్లు ప్రధాని అయ్యాడంటే.. గాంధీ కుటుంబం, అంబేడ్కర్‌ తీసుకువచ్చిన రాజ్యాంగం వల్లనేనని చెప్పారు. ప్రపంచమంతా మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడుస్తుంటే.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ మాత్రం చర్రితలో గాంధీ పేరు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో కోట్లాది మందికి ఉపాధిని అందిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరిట సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఆ పథకం నుంచీ గాంధీ పేరును తీసివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. గాంధీ, నెహ్రూ, రాహుల్‌గాంధీల కుటుంబ చరిత్రను లేకుండా చేసేందుకు మోదీ కుట్రలను నిరసిస్తూ త్వరలోనే లక్ష మందితో సంగారెడ్డిలో సభ పెడతానని, ఆ తేదీని త్వరలోనే ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.

Updated Date - Dec 18 , 2025 | 02:54 AM