Share News

Jagga Reddy Urges: కష్టకాలంలోనూ కాంగ్రె్‌సలో ఉన్నోళ్లే అభ్యర్థులు

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:40 AM

కాంగ్రెస్‌ అధికారంలో లేనప్పుడు సైతం పార్టీ కండువా కప్పుకొని పని చేసిన వారినే సర్పంచ్‌ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, వారి వద్ద డబ్బులున్నా.. లేకున్నా.....

Jagga Reddy Urges: కష్టకాలంలోనూ కాంగ్రె్‌సలో ఉన్నోళ్లే అభ్యర్థులు

  • సంగారెడ్డిలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి.. సీఎం రేవంత్‌తో మాట్లాడి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఆర్థికంగా సహకరించాలి

  • కాంగ్రెస్‌ ఇస్తున్న పథకాల గురించి చెప్పి ఓట్లు అడగాలి

  • పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారెవరైనా క్షమించబోను

  • సంగారెడ్డి, పటాన్‌చెరులో పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు

  • ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు

సంగారెడ్డి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధికారంలో లేనప్పుడు సైతం పార్టీ కండువా కప్పుకొని పని చేసిన వారినే సర్పంచ్‌ అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, వారి వద్ద డబ్బులున్నా.. లేకున్నా.. సర్పంచ్‌లుగా గెలిపించుకురావాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్‌ తరఫున సర్పంచ్‌లను గెలిపించి తీసుకొస్తే, సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సోనియా, రాహుల్‌, ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్న రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు, రూ.2లక్షల రుణమాఫీ, వరికి బోనస్‌, రైతు భరోసా గురించి చెప్పి ఓట్లు అడగాలన్నారు. రిజర్వేషన్‌పై పోటీ చేసే ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులుకు ఇతర నేతలు ఆర్థికంగా సహకరించాలని సూచించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే.. ఎంతటి వారైనా క్షమించనని జగ్గారెడ్డి హెచ్చరించారు. గత సీఎంలు వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సహకారంతో సంగారెడ్డి జిల్లాలో ఐఐటీ, సంగారెడ్డి- పటాన్‌చెరు ఫోర్‌ లేన్‌ రోడ్డు, అకోలా-నాందేడ్‌ రోడ్డు, సంగారెడ్డికి మంజీరా నీళ్లు, వ్యవసాయ వర్సిటీతోపాటు పలు మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. సీఎం రేవంత్‌రెడ్డితో తరచూ మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సహకారంతో సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాలకు అనేక పరిశ్రమలు తీసుకురానున్నామని, ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భార్య నిర్మల పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ విషయమై రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ చెప్పినా తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు.

Updated Date - Nov 26 , 2025 | 04:40 AM