Share News

Jagga Reddy: నెహ్రూపై మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే

ABN , Publish Date - Dec 07 , 2025 | 07:01 AM

దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై అబద్ధాలు చెబుతూ చరిత్రను మార్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు...

Jagga Reddy: నెహ్రూపై మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే

  • చరిత్ర మార్చేందుకు కుట్ర.. తీవ్రంగా ఖండించిన సోనియా

  • నెహ్రూ ఆలోచనలకు అనుగుణంగానే సోనియా నేతృత్వంలోని పదేళ్ల యూపీఏ పాలన

  • స్వాతంత్ర్యానికి మునుపు దేశ ప్రజలకు సరిపడా తిండి గింజలు పండేవి కావు

  • నెహ్రూ ఆధ్వర్యంలో 200 దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి దేశం

  • శ్రీరాముని ఆలోచన, ఆదర్శాలకు అనుగుణంగా పరిపాలించిన చరిత్ర నెహ్రూది..

  • రాముడిని ముందు పెట్టి ఓట్లేయించుకుని ప్రధాని అయిన చరిత్ర మోదీది: తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై అబద్ధాలు చెబుతూ చరిత్రను మార్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ కుట్రలను సోనియాగాంధీ తీవ్రంగా ఖండించారన్నారు. సోనియగా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో తాము సైనికుల్లా పనిచేస్తామని, వారి ఆదర్శాలను గాంధీ భావజాలాన్ని తమ భుజాన మోస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నెహ్రూ పాలనలో జరిగిన మంచిని.. మంచి అని చెప్పే గుణం బీజేపీకి లేకపోవడం దురదృష్టకరమన్నారు.శనివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూలు స్వాతంత్ర్యోద్యమం నడిపారని, దేశ ప్రజలు బానిసలుగా ఉండొద్దన్నదే సింగిల్‌ అజెండాగా చేసుకుని ముందుకు సాగారని పేర్కొన్నారు. మోదీ ఎన్ని అబద్ధాలు చెప్పినా నెహ్రూ చరిత్ర మార్చలేరన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టిన పార్టీ బీజేపీ అని చెప్పారు. మోదీ తన రాజకీయ జీవితంలో ప్రధాని కావాలన్న లక్ష్యంతోనే పని చేశారన్నారు. మోదీ మాదిరిగా ప్రధాని అవ్వాలన్న లక్ష్యాలు పెట్టుకుని స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి నెహ్రూ కాదని తెలిపారు. దేశ చరిత్రలో నెహ్రూ, గాంధీ కటుంబాలు చేసిన త్యాగాలూ ఉండొద్దని కుట్ర చేస్తున్నారన్నారు. ప్రజల మద్దతుతో ఆయన దేశానికి తొలి ప్రధాని అయ్యారని చెప్పారు.


స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ప్రజలకు సరిపడా తిండి గింజలు పండేవి కావన్నారు. ఆ స్థాయి నుంచి ప్రజలకు తిండి గింజలు దొరకడమే కాకుండా పొరుగున 200 దేశాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయికి మన వ్యవసాయం అభివద్ధి సాధించిందంటే అది నెహ్రూ ఘనతేనని కొనియాడారు. స్వాతంత్ర్యోద్యమంలో బీజేపీ, మోదీల పాత్ర ఏముందని ప్రశ్నించారు. ఆ పార్టీ సింగిల్‌ అజెండా రామాలయమేనన్నారు. శ్రీరాముని ఆలోచనలు, ఆదర్శాలను పరిగణనలోకి తీసుకుని నెహ్రూ పరిపాలించారని తెలిపారు. రాముని విగ్రహం ముందు పెట్టి ఓట్లేయించుకుని ప్రధాని అయిన చరిత్ర మోదీదని విమర్శించారు. 56 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వందల సంఖ్యలో చెప్పగలమని, గడిచిన 11 ఏళ్లలో అయోధ్యలో రామాలయం కట్టామని చెప్పడం తప్ప మోదీ ఏం చేశారో చెప్పగలరా అని నిలదీశారు.

Updated Date - Dec 07 , 2025 | 07:02 AM