ఎటూ పాలుపోవడం లేదు
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:26 AM
రైతు దేశానికి వెన్నుముక. ఆ రైతుకు వెన్నుముక పాడి. ఆ రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా మదర్ డెయిరీ జాప్యం చేస్తోంది.
పాడి రైతులకు అందని పాల బిల్లులు
మూడు మాసాలుగా బిల్లులు చెల్లించని మదర్ డెయిరీ
లీటర్‌కు రూ.4 బోనస్‌కు మంగళం..?
రైతు దేశానికి వెన్నుముక. ఆ రైతుకు వెన్నుముక పాడి. ఆ రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా మదర్ డెయిరీ జాప్యం చేస్తోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి పాడి రైతులకు బిల్లు చెల్లించాల్సి ఉంది. మార్చి నుంచి ఇప్పటి వరకు మూడు మాసాలుగా (ఆరు బిల్లులు) బిల్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచింది. అవసరానికి డబ్బులు అందకపోవడంతో పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి మోత్కూరు)
కూలీలకు, వ్యాపారులకు రోజు వారీగా, ఉద్యోగులకు నెలనెలా ఆదాయం(వేతనం) వస్తుండగా, రైతుకు పంట దిగుబడి వచ్చే వరకు పెట్టుబడికి ఖర్చు పెట్టడమే తప్ప దమ్మిడి ఆదాయం రాదు. పంట దిగుబడి రావడానికి ఐదారు మాసాలు పడుతుంది. అప్పటి వరకు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు అవసరమొ స్తుందని రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ఆవులనో, గేదెలనో సాకుతున్నారు. పాలు తాగే కుటుంబాలకు అమ్ముకోవాలంటే ఇంటింటికి తిరిగి పోయాలి. అందరూ ఒకేసారి బిల్లు ఇవ్వరు. ఒకే సారి బిల్లు వస్తే అవసరాలకు ఉపయోగపడుతుందని, ఇంటింటికీ తిరిగి పాలు పోయలేక రైతులు పాల సంఘాలకు పాలు పోస్తున్నారు. సంఘాలు పాడి రైతులకు ప్రతి 15రోజులకోసారి బిల్లు చెల్లించాల్సి ఉంది. మదర్ డెయిరీ యాజమాన్యం గత మార్చి నుంచి ఇప్పటివరకు మూడు మాసాలుగా ఆరు బిల్లులు చెల్లించ లేదు. ఇప్పుడు జూన్ మా సం. ఈ నెలలో పిల్లల చదువు లకు పాఠశాలలు, కళాశాల ఫీజులు, దుస్తులు, పుస్తకాలు తదితర ఖర్చులు ఉంటాయి. ఇదీ ఖరీఫ్ పంటల సాగు సీజన్ కూడా. పంటల సాగు ఖర్చులు ఉంటాయి. మూడు మా సాలుగా బిల్లు అందక ఇబ్బందులు పడుతున్నారు. తమకు రావాల్సిన డబ్బు రాక కుటుంబ అవసరాల కోసం అప్పులు చే యాల్సివస్తోందని, అప్పులకు వడ్డీ అవుతోందని ఆవేదన చెందుతున్నారు.
మదర్ డెయిరీ ఆధ్వర్యంలో 300 సొసైటీలు
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల్లో మదర్‌డెయిరీ పరిధిలో 24 పాల శీతలీకరణ కేంద్రాలు, సుమారు 300సొసైటీలు(పాల ఉత్పత్తి దారుల సహకార సంఘాలు) ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 65 వేల మంది రైతులు(సభ్యులు) ఉన్నారు. సొసైటీల ద్వారా రోజుకు సుమారు 60 వేల నుంచి 70 వేల లీటర్ల పాలు సేకరిస్తోంది.
పాడి రైతులకు రూ.35.10 కోట్లు బాకీ
మదర్ డెయిరీ రోజూ సుమారు 60వేల నుంచి 70వేల లీటర్ల పాలు సేకరిస్తోంది. వెన్న శాతాన్ని బట్టి లీటరు రూ.40 నుంచి రూ.100 రేటు చెల్లిస్తారు. సగటున రోజుకు 60వేల లీటర్ల పాలు డెయిరీకి వస్తాయను కున్నా, లీటరుకు సగటున రూ.65చొప్పున లెక్కిం చినా రోజుకు రూ.39లక్షల బిల్లు అవుతుంది. 15రోజులకు రూ.5.85 కోట్లు అవుతుంది. మూడు మాసాలకు ఆరు బిల్లులు రూ.35.10 కోట్లు చెల్లించాల్సి ఉంది.
బోనస్‌కు మంగళం..?
పాడి రైతులను ప్రోత్సహించడానికి, వారు నష్టాల పాలు కాకుండా ఆదుకోవడానికి 2017 నవంబరులో అప్పటి సీఎం కేసీర్ లీటరు పాలకు రూ.4 బోనస్ ఇస్తామని ప్రకటించారు. కొన్నేళ్లుగా గత ప్రభుత్వంతో పాటు, ఈ ప్రభుత్వం కూడా పాడి రైతులకు బోనస్ చెల్లించకపోవడంతో బోనస్‌కు మంగళం పాడినట్టేనంటున్నారు. తమకు పక్కాగా జ్ఞాపకం లేదగాని ఐదేళ్లుగా బోనస్ రావడం లేదని కొందరు, నాలుగేళ్లుగా రావడం లేదని మరికొందరు పాడి రైతులు చెబుతున్నారు. రోజుకు 60వేల లీటర్లకు రూ.4 చొప్పున రూ.2.40లక్షలు, ఏడాదికి రూ.8.76కోట్లు, నాలు గేళ్లకు లెక్కించినా రూ.35.04కోట్లు బోనస్ చెల్లించాల్సి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
రైతుల ఆందోళన బాట
మదర్ డెయిరీ మూడు మాసాలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన పాడి రైతులు ఇటీవల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోత్కూరు పాలశీతలీకరణ కేంద్రానికి తాళం వేశారు. తమకు బిల్లులు చెల్లించే వరకు తాళం తీసేది లేదని ఆందోళన చేశారు. పాలు తీసుకెళ్లడానికి వచ్చిన పాల ట్యాంకర్‌ను కేంద్రంలోకి వెళ్లనివ్వలేదు. దీంతో దిగొచ్చిన అధికారులు ఆ రైతులకు ఒక నెల బిల్లు రూ.1.50 లక్షలు అప్పటికప్పడు చెక్కురాసి ఇచ్చి చెల్లించారు.