kumaram bheem asifabad- చినుకు పడదు.. చింత తీరదు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:26 PM
ఈ ఏడాది తొలకరి జల్లులు ముం దే పలకరించడంతో జిల్లాలోని రైతులు పత్తి విత్తనాలు పెట్టుకున్నారు. మరి కొందరు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కానీ మృగశిర కార్తె ముగిసిపోతున్నా ఇప్పటికీ భారీ వర్షం లేక పోవడంతో భూమిలో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. కొంత నీటి తడి ఉన్న భూముల్లో మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి.
- భూమిలో నీటిజాడ కరువు
- ముందస్తు తొలకరి ఆశలు ఆవిరి
- ముఖం చాటేసిన వరుణుడు
- ఆందోళనలో అన్నదాతలు
కౌటాల/చింతలమానేపల్లి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది తొలకరి జల్లులు ముం దే పలకరించడంతో జిల్లాలోని రైతులు పత్తి విత్తనాలు పెట్టుకున్నారు. మరి కొందరు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కానీ మృగశిర కార్తె ముగిసిపోతున్నా ఇప్పటికీ భారీ వర్షం లేక పోవడంతో భూమిలో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. కొంత నీటి తడి ఉన్న భూముల్లో మొలకెత్తిన మొక్కలు వాడిపోతున్నాయి. రుతుపవనాల వ్యాప్తికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించిన రైతులు వర్షాల లేమి ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసిం ది. రోహిణి కార్తె ప్రవేశించాక వర్షాలు కురుస్తాయని భావిస్తే నిరాశే ఎదురవుతోంది. మృగశిర కార్తె పూర్తవుతున్నా ఇప్పటికీ వర్షాలు కురవడం లేదు. వరుణుడు కరుణించి వర్షాలు కురిసి చెరువులు నిండితేనే వానాకాలం పంటలు పండే అవకాశాలు ఉన్నాయి.
- దుక్కులు దున్ని.. దిక్కులు చూస్తూ..
జిల్లాలోని రైతులు వానాకాలం పంట సాగుకు తొలకరి వర్షాలకు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. అనంతరం భారీ వర్షం లేక పోవడంతో దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో అధిక శాతం మంది రైతులు వర్షాధారంపై ఆధారపడే పంటలు సాగే చేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు భారీ వర్షం కురువ లేదు. కొన్ని చోట్ల మాత్రం తొలకరి జల్లులకే రైతులు విత్తనాలు పెట్టారు. జిల్లాలో పలువురు రైతులు చేన్లను దున్ని పత్తి గింజలను విత్తారు. ఒక్కో రైతు వేలల్లో ఖర్చు చేసి విత్తనాలను నాటారు. వర్షాలు కురవకపోవడం, ఎండలు మండుతుండడంతో గింజలపై ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండలకు భూమిలో పదును లేక పుట్టిన మొక్కలు వాడి పోతున్నాయి. వేలాది ఎకరాల్లో పత్తి గింజలు నాటిన రైతులు వరుణుడి కరుణ కోసం ఆకాశం వంక ఆశగా చూస్తున్నారు. మరో రెండు మూడురోజులు ఇలాగే ఉంటే పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు చెబుతున్నారు. మరో వైపు పొడి దుక్కిలో వేసిన గింజలు గతంలో కురిసిన భారీ వర్షానికి అచ్చుసాళ్లు మూసుకుపోయి గింజలు మొలకెత్తక పోవడంతో ఒక్కో రైతు తీవ్రంగా నష్ట పోయాడు. ఓ వైపు మొలకెత్తని పత్తి గింజల కోసం కొందరు రైతులు బాధపడుతుండగా మరో వైపు మొలకెత్తిన పత్తి మొక్కలను కాపాడుకోవడానికి ఏం చేయాలా అని మరికొంత మంది రైతులు ఆలోచన చేస్తున్నారు. వ్యవసాయాధికారులు కనీసం 6 సెంటీమీటర్ల వర్షం పడితే తప్ప విత్తనాలు వేయకూడదని రైతులకు సూచిస్తున్నారు.
- రైతుల పాట్లు..
పత్తి విత్తనాలు నాటిన రైతులు తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. విత్తనాలు నాటిన దగ్గర నుంచి నేటి వరకు వర్షాలు కురువక పోవడంతో విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తిన విత్తనాలు ఎండలకు మాడి పోతున్నాయి. దీంతో పత్తి విత్తనాలు కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. బకెట్లు, బిందెలతో మొక్కలకు నీళ్లు పోస్తున్నా రు. మొలకెత్తని పత్తి విత్తనాలకు సైతం నీళ్లు చల్లుతున్నారు. వ్యవసాయ బావుల్లో సైతం నీరు లేదు. వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి బావుల్లో నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది. మండలంలో ఇప్పటి వరకు వెయ్యి ఎకరాలకు పైగా పత్తి విత్తనాలు నాటారు. కానీ వర్షాలు లేకపోవడంతో మొలకలు వాడిపోతున్నాయి.