Income Tax Raids: పప్పు దినుసుల ట్రేడర్లపై ఐటీ దాడులు
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:52 AM
పప్పు దినుసుల ట్రేడింగ్‌లో దాదాపు రూ.300 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఆదాయం పన్ను.....
తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు
ఐటీ రాడార్‌లో రెండు కంపెనీలు
300 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు
హైదరాబాద్/అలంపూరు చౌరస్తా, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పప్పు దినుసుల ట్రేడింగ్‌లో దాదాపు రూ.300 కోట్లకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఆదాయం పన్ను(ఐటీ) శాఖ ఇన్వెస్టిగే షన్ వింగ్ అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, కర్నూలులోని పలువురు వ్యాపారులు, హిందుస్థాన్ ట్రేడర్స్, వి కేర్ గ్రూపు కంపెనీల యజమానులు, వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. 2022 నుంచి ఈ ట్రేడింగ్ కంపెనీలవారు ముఖ్యంగా కందిపప్పు అమ్మకాల లెక్కలు చూపించడంలో విఫలమయ్యారని, గిడ్డంగుల్లో ఉన్న సరుకు, ప్రభుత్వ నిత్యావసర వస్తువుల పంపిణీ పథకానికి ఇచ్చిన పప్పులకు సంబంధించిన లెక్కల్లో గోల్‌మాల్ జరిగిందని ఆదాయం పన్ను శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఈ దాల్ ట్రేడర్స్ పెద్ద ఎత్తున బహిరంగ విక్రయాలు జరిపారని, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇది జరిగిందనే అనుమానాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పౌర సరఫరాల శాఖ కోసమంటూ కందిపప్పు ఆర్డర్లు తీసుకుని ఆ మొత్తాన్ని సేకరించి గిడ్డంగుల్లో దాచి, ప్రభుత్వానికి సరఫరా చేయకుండా బయట అమ్ముకున్నారనే ఆరోపణలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఉండవల్లి వీకేర్ సీడ్స్ కంపెనీలో సోదాలు
గద్వాల జిల్లా ఉండవల్లిలోని వీకేర్ సీడ్స్ కంపెనీలో మంగళవారం ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. వీ కేర్ సీడ్స్ కంపెనీకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, గోడౌన్లు, విత్తన ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ కంపెనీ డైరెక్టర్లుగా వెంకట్రావు, వెంకట్‌రెడ్డి, కిరణ్‌కుమార్ వ్యవహరిస్తున్నారు. వీరు కంది, వేరుశనగ, సోయాబీన్, పప్పుశనగ తదితర వ్యవసాయ విత్తన, ఉత్పత్తుల హోల్‌సేల్ డీలర్లుగా కూడా ఉన్నారు. గద్వాల జిల్లా ఉండవల్లి మండల పరిధిలోని 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న వీ కేర్ సీడ్స్ గోడౌన్, విత్తన ప్రాసెసింగ్ యూనిట్ కార్యాలయంలో ఐటీ అధికారులు మంగళవారం దాడులు చేశారు.