IT Minister Duddilla Sridhar Babu: ప్రజల సమాచారం..బీఆర్‌ఎస్ పరం!
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:03 AM
రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గత బీఆర్‌ఎస్ సర్కారు తస్కరించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు....
రాజకీయ లబ్ధికి వాడుకున్న గత సర్కారు
ఇది తీవ్ర నేరం.. విచారణ చేపడతాం
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
‘ఆంధ్రజ్యోతి’తో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గత బీఆర్‌ఎస్ సర్కారు తస్కరించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆ సమాచారాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందని ఆరోపించారు. ఇది తీవ్రమైన నేరమన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వమే దుర్వినియోగం చేసిందని.. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం మీసేవ వాట్సాప్ సేవలను ప్రారంభించిన అనంతరం మంత్రి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనడాన్ని ప్రస్తావించగా.. మంత్రి స్పందించారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, కుంభకోణాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్నీ దుర్వినియోగం చేసిందని, ఇది తీవ్రమైన అంశమని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఇటీవలే వెలుగులోకి రాగా.. అదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం చెప్పిందని, దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. సంక్షేమ పథకాల పేరు చెప్పి గత ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందన్నారు. ఎస్‌ఈసీ చెప్పిన ప్రతి అంశంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపిస్తుందని చెప్పారు. ఎవరినీ ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
త్వరలో విచారణకు ఆదేశం..
ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని నిర్ణయించింది. ప్రాథమిక వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుంది. ‘రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం ఓటర్ల వివరాలు ఇవ్వాలన్న గత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సమాచారం అందించాం. అయితే గత సర్కారు దాన్ని దుర్వినియోగం చేసింది’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి గత నెలలో చెప్పిన విషయం తెలిసిందే.